పోలీసులు అమాయకులంటున్న పేర్ని నాని.. విచారణలో ఆసక్తికర సమాధానాలు!
ఈ నేపథ్యంలో సత్తెనపల్లి పర్యటన విషయంపై తాజాగా పేర్ని నానిని పోలీసులు విచారించారు.
By: Tupaki Desk | 8 July 2025 2:00 PM ISTఇటీవల కాలంలో ఏపీలో జగన్ జిల్లాల పర్యటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. పరామర్శలకు వెళ్తున్న జగన్ కు ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని వైసీపీ నేతలు చెబుతుంటే.. పోలీసులు మాత్రం నిబంధనల్ని ఉల్లంఘించి ఈ టూర్లు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి పర్యటన విషయంపై తాజాగా పేర్ని నానిని పోలీసులు విచారించారు.
అవును... జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, ఆస్తుల్ని ధ్వంసం చేయడం, మొదలైన వ్యవహారాలతో అది కాస్తా తీవ్ర చర్చనీయాంశంగా మారింది! ఈ సందర్భంగా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పేర్ని నానిని పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా... పట్టణంలో జరిగిన ర్యాలీలో మీరు పాల్గొన్నారా? అనే ప్రశ్నకు... తాను కారులో ఉన్నానని సమాధానం చెప్పారు!
ఇదే సమయంలో సత్తెనపల్లి పట్టణంలో ఎటువంటి అనుమతుల్లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా డీజేతో డ్యాన్సులు చేయడం, ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం వంటి విషయాలు మీకు తెలియవా? అని పోలీసులు ప్రశ్నించగా... 'జగన్ కారు ఎక్కమంటే ఎక్కాను.. కారులోనే తిరిగి వెళ్లాను.. అనుమతుల గురించి నాకేం తెలియదు' అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని... 11 సెక్షన్లతో తనపై కేసు పెట్టారని, మచిలీపట్నంలోని కార్యాలయంలో ఆదివారం పోలీసులు నోటీసు అంటించి వెళ్లడంతో విచారణకు వచ్చానని చెప్పారు. సత్తెనపల్లిలో వైసీపీ ఇన్ ఛార్జి, ఛైర్ పర్సన్ ఎవరో కూడా ఇక్కడికి వచ్చేవరకు తనకు తెలియదని, తాను ఎవరితోనూ మాట్లాడలేదని అన్నారు.
ఈ సందర్భంగా... తనకు రెంటపాళ్లే కాదు సత్తెనపల్లి ఎక్కడో కూడా తెలియదని.. ఇక్కడికి రావడం ఇదే తొలిసారని చెప్పిన పేర్ని నాని.. పాలకుల ఒత్తిడితో వారి కుర్చీలను కాపాడుకునేందుకు పోలీసు అధికారులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, సత్తెనపల్లి పోలీసులు అమాయకులని వ్యాఖ్యానించారు.
కాగా... జూన్ 18న జగన్ సత్తెనపల్లి పట్టణంలో సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టడంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు తలెత్తిన విషయం తెలిసిందే! ఈ పర్యటనలో ‘రప్పా రప్పా’ ఫ్లకార్డులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.