అదే తీరు.. జగన్ గ్రాఫ్ బేజారు ..!
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి.. ఆయన వ్యక్తిత్వం పరిశీలిస్తున్న వారు ఆయన ఎవరికీ అర్థం కాడండి.
By: Tupaki Desk | 24 Jun 2025 9:00 PM ISTవైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి.. ఆయన వ్యక్తిత్వం పరిశీలిస్తున్న వారు ఆయన ఎవరికీ అర్థం కాడండి. ఆయన వ్యవహార శైలి ఎవరికీ కొరుకుడు పడదందీ.. అనే మాట వినిపిస్తోంది. నిజానికి ఈ మాట ఎవరో ఆయన అంటే కిట్టని వారు.. లేకపోతే ప్రత్యర్థులు.. చెబుతున్న మాటయితే కాదు. ఆ పార్టీలో ఉండి బయటకు వచ్చిన మైసూరా రెడ్డి వంటి సీనియర్ నాయకులు అంటున్న మాట. ఒకప్పుడు ఈయన వైసీపీలోనే ఉన్నారు. మొదట్లోనే బయటికి వచ్చారు. అప్పట్లోను ఇవే వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎవరికీ అర్థం కాడనే చెప్పారు.
తాజాగా ఆన్లైన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మైసూరా రెడ్డి ఇవే వ్యాఖ్యలు చేయటం విశేషం. ఒక్క మైసూర్ రెడ్డి మాత్రమే కాదు, వైసీపీ నుంచి బయటకు వచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా జగన్ నాకు అర్థం కాలేదు అని ఇటీవల వ్యాఖ్యానించారు. వాస్తవానికి జగన్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న నాయకుల్లో బాలినేని ముఖ్య నాయకుడు. అలాంటి నాయకుడే ఇలా వ్యాఖ్యానించారు అంటే ఇక ఇతర నాయకుల పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు.
నాయకుల మాటే కాదు గతంలో జగన్ ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఆయన చెప్పిందే వేదం, ఆయన తీసుకున్న నిర్ణయమే వేదం.. అన్నట్టుగా జగన్ అనుసరిస్తారని వారు చెప్పుకొచ్చారు. ఎల్ వి సుబ్రహ్మణ్యం వంటి సీనియర్ అధికారులు నేరుగానే విషయాన్ని బయటపెట్టారు. మరికొందరు ఐపీఎస్ లు కూడా దాదాపు ఇవే అభిప్రాయంతో ఉన్నారు. అంటే జగన్ ఒక విధమైన వ్యక్తిత్వం, ఒక విధమైన వ్యవహారంతో నడుస్తారనేది అర్థమవుతుంది.
గతంలో కాంగ్రెస్ను వ్యతిరేకించినప్పుడు కూడా ఆయన వ్యవహార శైలిని కొందరు తప్పుపట్టారు. కాబట్టి జగన్ ఒక అర్థం కాని నాయకుడు అనే మాట అయితే జోరుగా వినిపిస్తుండడం గమనించాల్సిన విషయం. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్న ప్రజల మధ్యకు వచ్చేసరికి మాత్రం నాయకుడు ప్రజలకు చేరువు కావాలి. ప్రజల మనసును చూరగొనాలి. కానీ ఎంతసేపు సింపతి లేదా సామాజిక వర్గాల మధ్య విభేదాలు వంటిని ఆసరా చేసుకుని రాజకీయాల్లో ఎదగాలని భావించటం ఎవరికి మంచిది కాదు. కాబట్టి జగన్ తన తీరును తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది పరిశీలకులు చెబుతున్న మాట.