జాతీయ మీడియాను శరణు జొచ్చిన జగన్.. రీజనేంటి?
చాన్నాళ్ల తర్వాత.. వైసీపీ అధినేత జగన్.. జాతీయ మీడియాను తన నివాసం.. తాడేపల్లి ప్యాలెస్‌కు పిలి పించుకున్నారు.
By: Garuda Media | 14 Aug 2025 8:30 AM ISTచాన్నాళ్ల తర్వాత.. వైసీపీ అధినేత జగన్.. జాతీయ మీడియాను తన నివాసం.. తాడేపల్లి ప్యాలెస్‌కు పిలి పించుకున్నారు. ఏపీ మీడియాతో కలిసి తొలుత వారితో రెండు గంటలకు పైగా సంభాషించిన జగన్.. ఆ తర్వాత.. ప్రత్యేకంగా జాతీయ మీడియాతో మరో రెండు గంటలకు సంభాషించారు. ఈ సందర్భంగా .. గత ఏడాది జరిగిన ఎన్నికలు, రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం.. పాలన తీరు వంటివాటిని ఆయన ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా పూర్తిగా ఆంగ్లంలోనే జగన్ సంభాషించడం విశేషం.
వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్నసమయంలో కూడా రెండు సార్లు కేవలం జాతీయ మీడియాను పిలు చుకుని జగన్ మీడియా సమావేశాలు పెట్టారు. ఆ సమయంలో రాష్ట్రంలోని తెలుగు మీడియాను పూర్తిగా ఎవాయిడ్ చేశారు. ఆ తర్వాత.. ఏడాదికి పైగా జగన్ మౌనంగా ఉన్నారు. మరోసారి బుధవారం మాత్రమే ఆయన ప్రత్యేకంగా జాతీయ ఆంగ్ల, హిందీ మీడియా ప్రతినిధులను కూడా పిలిపించుకున్నారు. అయితే.. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. వీటిని జాతీయ స్థాయిలో హైలెట్ చేసే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను జగన్ ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
1) ఓట్ల చోరీ, నకిలీ ఓట్లు, ఎన్నికల ఫలితం సమయంలో పెరిగిన ఓట్ల అంశంపై తాను ప్రత్యక్షంగా జాతీయ స్థాయిలో ఎలుగెత్తలేకపోవడం.. ఈ మీడియా ద్వారా తన వ్యూహాన్ని.. ఏపీలో జరిగిన ఎన్నికల తీరును వివరించే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను పిలిచినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. తద్వారా ఏపీలోనూ ఓట్లలో జరిగిన అవకతవకలు.. అన్యాయాలు వంటివాటిని జాతీయస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు జగన్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు చెబుతున్నారు.
2) తాజాగా జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల వ్యవహారాన్ని కూడా జాతీయస్థాయి కి తీసుకువెళ్లాలన్న ఉద్దే శంతో జగన్ ఈ పనిచేశారని అంటున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ ఉప పోరులో వైసీపీ ని ఇరుకున పెట్టారని.. అన్యాయం, అక్రమంగా పోలింగ్ నిర్వహించారని.. దీనికి అధికారులు కూడా సహకరించారని జగన్ చెప్పడం ద్వారా జాతీయ స్థాయిలో తన వాదనను బలంగా వినిపించే ఉద్దేశంతోనే జాతీయ మీడియాను ఆయన పిలిచినట్టు సమాచారం. కాగా.. ఇంగ్లీష్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రతి ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పారు.