Begin typing your search above and press return to search.

టూర్ వార్ ని పీక్స్ కి చేర్చబోతున్న జగన్!

ఏపీలో టూర్ వార్ నడుస్తోంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ టూర్లు చేస్తూంటే అది వార్ గా మారుతోందా లేక మారుస్తున్నారా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

By:  Tupaki Desk   |   24 Jun 2025 6:00 PM IST
టూర్ వార్ ని పీక్స్  కి  చేర్చబోతున్న జగన్!
X

ఏపీలో టూర్ వార్ నడుస్తోంది. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ టూర్లు చేస్తూంటే అది వార్ గా మారుతోందా లేక మారుస్తున్నారా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. అంతకు ముందు రాప్తాడు, ఆ తరువాత తెనాలి, నిన్న పొదిలి, నేడు రెంటపాళ్ళ ఇలా జగన్ ఎక్కడికి వెళ్ళినా అది వివాదం అవుతోంది. ఒక పార్టీ నాయకుడిగా ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గరకు వెళ్ళే హక్కు తమకు లేదా అని వైసీపీ అధినాయకత్వం ప్రశ్నిస్తోంది.

అదే సమయంలో ఘర్షణల కోసమే టూర్లు చేస్తున్నారు అని అధికార పక్ష కూటమి విమర్శిస్తోంది. అంతే కాకుండా జగన్ టూర్లకు వెళ్ళిన చోట కూడా అనుకోని సంఘటనకు చోటు చేసుకుంటున్నాయి. రాప్తాడు పర్యటనకు వెళ్తే జగన్ వచ్చిన హెలికాప్టర్ మీద దాడి జరిగింది అన్నారు. జనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులను అవసరమైనంతగా పెట్టలేదని అన్నారు. అయితే వైసీపీ నేతలు క్యాడర్ వల్లనే అలాంటివి జరిగాయని ఎక్కువ మందితో జనసమీకరణ చేయడం ద్వారానే ఇలాంటివి చేస్తున్నారు అని కూటమి బదులిచ్చింది.

తెనాలిలో సైతం భారీగా జనాలతో రావడంతో గందరగోళం ఏర్పడింది అని విమర్శలు అధికార కూటమి నుంచి వచ్చాయి. పొదిలిలో అయితే ఏకంగా పోలీసుల మీద మహిళల మీద వైసీపీ కార్యకర్తలు దాడులు చేసారు అని కేసులు కూడా కట్టారు. ఇక రెంటపాళ్ళ పర్యటనలో ఏకంగా జగన్ మీదనే కేసు ఫైల్ అయింది ఆయన ప్రయాణిస్తున్న కారు కిందన ఓ వృద్ధుడు పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు అని వీడియో తాజాగా బయటకు రావడంతో అది రాజకీయ రచ్చగా మారింది.

ఈ నేపధ్యంలో పార్టీ ముఖ్య నేతలతో పాటు సీనియర్లతో జగన్ ఒక కీలకమైన సమావేశాన్ని ఈ నెల 25న తాడేపల్లిలోని తన ఆఫీసులో నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ సమావేశం ద్వారా జగన్ సంచనల నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు. జూలై 8న వైఎస్సార్ జయంతి వేడుకలు ఉన్నాయి.

ఆ రోజు నుంచి జగన్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. ఇలా వారానికి పది రోజులకు ఒక టూర్ చేస్తూంటే వివాదాలు సృష్టిస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది. తమ నేతను ఇక జనాలకు దూరం చేయడంతో పాటు బయటకు తిరగకుండా కట్టడి చేసే ఎత్తుగడ కూడా ఉందని అనుమానిస్తోంది. దాంతో దానిని విరుగుడుగా జగన్ నిరంతరం జనంలో ఉండేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది అని అంటున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండవ ఏడాది అయిన నేపధ్యంలో జనంలో వ్యతిరేకత మెల్లగా పెరుగుతోందని దాంతో జనం మధ్యనే వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఫలితం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. అంతే కాదు జనం మధ్యలో జగన్ ఉంటే రేపటి రోజున ఆయనను అరెస్ట్ చేయాలని చూసినా వచ్చే స్పందన వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు.

మొత్తానికి చూస్తే జగన్ టూర్ల మీద కూటమి వేసే స్కెచ్ లకు పై ఎత్తు వేయాలని జగన్ వరసబెట్టి జిల్లా టూర్లకు రెడీ కావడమే మంచిదని పార్టీ నేతలు అంటున్నారు. జగన్ సైతం అదే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. దీనిని సంబంధించి పార్టీ నిర్వహించే కీలక సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. జగన్ జిల్లా టూర్ల ప్రకటన వస్తే కనుక కూటమి వర్సెస్ వైసీపీ అన్న రాజకీయ యుద్ధం మరింతగా పెరుగుతుందా అన్నది చర్చగా ఉంది.