Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీకి టచ్ లో చంద్రబాబు...నిజమేనా ?

అయితే తెలుగుదేశం కాంగ్రెస్ కలవడం అన్నది కొత్త విషయం ఏమీ కాదని అంతా అంటారు.

By:  Satya P   |   13 Aug 2025 4:00 PM IST
రాహుల్ గాంధీకి టచ్ లో చంద్రబాబు...నిజమేనా ?
X

జాతీయ రాజకీయాల్లో చాలా చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ నాయకత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పాలన సాగిస్తోంది. మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అండ్ కో ఇండియా కూటమిగా స్ట్రాంగ్ అపొజిషన్ గా ఉన్నారు. 2024 ఎన్నికల తరువాత వచ్చిన మార్పు ఏమిటి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో రాహుల్ ఉన్నారు. గతం కంటే ఎక్కువగా ఇండియా కూటమి సీట్లు పెరిగాయి. అదే సమయంలో బీజేపీకి సొంతంగా బలం లేదు, సింపుల్ మెజారిటీకి చాలా దూరంలో ఆ పార్టీ ఉంది. మిత్రుల సాయంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది. గట్టిగా పదునాలుగు నెలలు కాలేదు కానీ మోడీ ప్రభుత్వాన్ని రాహుల్ అండ్ కో దూకుడుగానే సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో ఎపుడు ఏమి జరుగుతుందో అన్న చర్చ అయితే ఉంది.

బాంబు పేల్చిన జగన్ :

జాతీయ రాజకీయాలలో చూస్తే ఎన్డీయే కూటమి ఇండియా కూటమి రెండే ఉన్నాయి. ఈ రెండింటిలోనే దేశంలోని నూటికి తొంబై శాతం పార్టీలు చేరిపోయాయి. పది శాతం పార్టీలు మాత్రం తటస్థంగా ఉన్నాయి. అయితే ఏపీ నుంచి చూస్తే టీడీపీ ఎన్డీయే కూటమిలో ఉంది. మోడీ ఈజ్ గ్రేట్ అని రోజుకు ఒకసారి అయినా చాలా గట్టిగా చంద్రబాబు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసి 2024 ఎన్నికల్లో జత కలిసిందో అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్ లో ఉన్నారు అని వైసీపీ అధినేత జగన్ బాంబు పేల్చారు.

ఆయన ద్వారానట :

తెలంగాణా లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు రాహుల్ గాంధీకి టచ్ లో ఉన్నారు అని జగన్ ఆరోపించారు. ఇక రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఎంత కీలకంగా ఉండేవారో తెలిసిందే. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారుగా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డితో ఈ రోజుకీ చంద్రబాబుకు మంచి సంబంధాలే ఉన్నాయని బీఆర్ ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. ఇక ఏపీలో చూస్తే జగన్ కూడా అదే నమ్ముతారు. ఇపుడు ఆయన దీనికి మరికాస్తా పెంచి బాబు రాహుల్ గాంధీకి టచ్ లో ఉంటున్నది నిజం అంటున్నారు. రేవంత్ రెడ్డి ద్వారా ఇదంతా జరుగుతోంది అని చెబుతున్నారు.

కొత్త విషయం అయితే కాదుగా :

అయితే తెలుగుదేశం కాంగ్రెస్ కలవడం అన్నది కొత్త విషయం ఏమీ కాదని అంతా అంటారు. 2018లో తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కాంగ్రెస్ కలసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి ద్వారానే ఈ పొత్తు సాధ్యపడింది అంటారు. ఇక దీనికంటే ముందు బెంగళూరులో కాంగ్రెస్ మిత్రుల ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ దాని సన్నిహిత పార్టీలతో కలసి బాబు కనిపించారు. ఆ తరువాత తెలంగాణాలో కూడా పొత్తు ఖరారు అయింది. అందువల్ల రాజకీయంగా ఏమైనా జరగవచ్చు అన్న వారూ ఉన్నారు.

జగన్ సూటి ప్రశ్న :

ఏపీలో ఓట్ల చోరీ మీద రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరు అని జగన్ సూటిగా ప్రశ్నించారు. ఎందుకు మాట్లాడరు అంటే చంద్రబాబుతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నారు కాబట్టి అని ఆయన అసలు విషయం ఇదే అంటున్నారు. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో పోలింగ్ ముగిసేనాటికి కౌంటింగ్ నాటికి 12.5 పెరిగాయి. అంటే 48 లక్షల ఓట్లు ఒకేసారి పెరిగాయని ఆయన చెప్పారు. మరి ఇంత పెద్ద ఎత్తున ఓట్ల చోరీ ఏపీలో జరిగితే రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.

అంతే కాదు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జి మాణికం ఠాగూర్ కూడా ఏపీ వ్యవహారాల మీద నోరెత్తరని అమరావతిలో జరుగుతున్న అవినీతి మీద కూడా మౌనంగా ఉంటారని జగన్ విమర్శించారు. మొత్తం మీద చంద్రబాబు రాహుల్ మధ్య కొత్తగా మరోసారి బంధం పెనవేసుకుంటోంది అని జగన్ చెప్పిన వార్త జాతీయ రాజకీయాల్లో అతి పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అంతే కాదు బీజేపీ శిబిరంలో కూడా వేడి పుట్టించే చాన్స్ ఉంది అని అంటున్నారు.