ఒక యుద్ధం ముగిసింది.. రెండు గుడ్ న్యూస్ లు వినిపించాయి!
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వండంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Jun 2025 1:40 PM ISTఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వండంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇరాన్ దాడులు మరింత ఉధృతం చేయడంతోపాటు హర్మూజ్ జలసంధిని మూసివేస్తకు ఆ దేశ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా ఆ ఇరు దేశాల మధ్య యుద్ధం ఆగింది.. దీంతో రెండు గుడ్ న్యూస్ లు తెరపైకి వచ్చాయి.
అవును.. పశ్చిమాసియాలో అత్యంత భీకరంగా జరుగుతూ, రోజురోజుకీ ముదురుతోన్న ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం తాజాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ కు ఇరు దేశాలు అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించగా.. అనంతరం ఇరు దేశాలు ఒకరితర్వాత ఒకరు ఈ మేరకు ప్రకటనలు విడుదల చేశాయి. దీంతో.. హార్మూజ్ మూసివేత టెన్షన్ కూడా పోయింది.
వాస్తవానికి హర్మూజ్ జలసంధి మూసివేత దిశగా ఇరాన్ అడుగులు వేసిందనే వార్తలు టెన్షన్ పెట్టాయి. ఇదే జరిగితే బ్యారెల్ చమురు ధర 80 డాలర్లు దాటుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఫలితంగా... ప్రధానంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ కు ద్రవ్యలోటు పెరగడంతో పాటు ద్రవ్యోల్బణమూ పెరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
అయితే తాజాగా యుద్ధం ఆగడంతో.. ముడిచమురు ధరలు 5 శాతం మేర తగ్గుముఖం పట్టాయి. ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన అనంతరం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 3.53 డాలర్లు లేదా 4.94 శాతం తగ్గుముఖం పట్టి 67.95 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ రకం కూడా 5 శాతం మేర క్షీణించి బ్యారెల్ 65 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన దేశీయ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. దీంతో... మంగళవారం నాటి ట్రేడింగ్ ను సూచీలు భారీ లాభాలతో ప్రారంభించాయి. ఇందులో భాగంగా... సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకు పైగా ఎగబాకగా.. నిఫ్టీ 25,200 మార్క్ దాటి ట్రేడ్ అవుతోంది.
ఇదే సమయంలో.. డాలర్ తో రూపాయి మారకం విలువ 68 పైసలు పెరిగి 86.10గా ట్రేడ్ అవుతోండగా... సుమారు అన్నిరంగాల సూచీలు రాణిస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఆటో, ఎఫ్.ఎం.సీ.జీ, బ్యాంకింగ్, ఐటి రంగాల సూచీలు ఒక శాతానికి పైగా పెరిగాయి.