ఇరాన్ తో యుద్ధం... ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరిందా?
అవును... సుమారు 12 రోజుల పాటు పశ్చిమాసియాలో భీకరంగా జరిగిన ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం తాజాగా ముగిసింది. ఇదంతా తన మధ్యవర్తిత్వ ఫలితమే అని ట్రంప్ ప్రకటించారు. సీజ్ ఫైర్ ను ఇరాన్ కూడా ధృవీకరించింది.
By: Tupaki Desk | 24 Jun 2025 1:13 PM ISTసాధారణంగా యుద్ధం అంటే ఒకరు గెలుస్తారు.. మరొకరు ఓడిపోతారు! అయితే.. సరైన మధ్యవర్తిత్వంతోనో, ఆయా దేశాల మధ్య దెబ్బలు తిన్న తర్వాత వచ్చే ఆలోచనతోనో కాల్పుల విరమణ ఒప్పందాలు జరుగుతుంటాయి. దీంతో.. ఫలితం తేలకుండానే యుద్ధాలు ముగుస్తున్నాయి. ఇటీవల జరిగిన భారత్ - పాక్ యుద్ధం దీనికి ఒక ఉదాహరణ. ఈ క్రమంలో ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధంలో గెలుపెవరిది అనేది చర్చనీయాంశంగా మారింది.
అవును... సుమారు 12 రోజుల పాటు పశ్చిమాసియాలో భీకరంగా జరిగిన ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం తాజాగా ముగిసింది. ఇదంతా తన మధ్యవర్తిత్వ ఫలితమే అని ట్రంప్ ప్రకటించారు. సీజ్ ఫైర్ ను ఇరాన్ కూడా ధృవీకరించింది. ఈ సమయంలో ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు.. ఇజ్రాయెల్ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అవుననే సమాధానం అమెరికా నుంచి వినిపిస్తుంది. తాజాగా జేడీవాన్స్ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం అని అంటున్నారు.
ఇజ్రాయెల్ దాడులకు కారణం ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందనే సందేహం. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. వాటివల్ల తమ అస్తిత్వానికి ముప్పు పొంచి ఉందని.. అందుకే ఆ దేశంలోని అణుకేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన వాన్స్... ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను శిథిలాల కింద పాతేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అయితే.. తాము ఆ లక్ష్యాన్ని సాధించామని వెల్లడించారు. శుద్ధి చేసిన యురేనియం నుంచి అణ్వాయుధం తయారుచేసే సామర్థ్యం ఇరాన్ కు ఇక లేదని తెలిపారు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆయన... ఇరాన్ కు అణ్వాయుధాలు అందకుండా చేయడంలో అమెరికా నిబద్ధతను వెల్లడించారు. తాము ఇరాన్ తో ఇప్పటికైతే యుద్ధంలో లేము కానీ, ఇరాన్ అణు కార్యక్రమంపై మాత్రం పోరాడుతున్నామని స్పష్టం చేశారు.
దీంతో... ఇజ్రాయెల్ చేపట్టిన "ఆపరేషన్ రైజింగ్ లయన్" సక్సెస్ అయినట్లేనని అంటున్నారు పరిశీలకులు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు, వారికి ఆ సామర్థ్యం ఉండకూడదు, వారు ఆ దిశగా ప్రయత్నాలు చేయకూడదు.. ఇవే ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ యుద్ధం లక్ష్యాలు. సో... అవన్నీ నెరవేరినట్లేనని అంటున్నారు నిపుణులు!
ఇదే సమయంలో... ఈ విషయంపై ఇరాన్ కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా... ఒకవేళ ఇరాన్ మళ్లీ భవిష్యత్తులో అణ్వాయుధాలు తయారుచేయాలనుకుంటే.. వారు అత్యంత శక్తిమంతమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం... ఇప్పటికే టెహ్రాన్ కాల్పుల విరమణను మొదలుపెట్టగా.. సీజ్ ఫైర్ ను తామూ అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా... ఇరాన్ నుంచి అణుముప్పు తొలగిపోయిందని ఆ ప్రకటనలో పేర్కొన్న నెతన్యాహు.. ఇందుకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ యుద్ధం విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ వెర్షన్ ఈ విధంగా ఉంటే... ఇరాన్ మీడియా మాత్రం మరో రకంగా స్పందించింది. ఇందులో భాగంగా... ఖతార్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విజయవంతంగా దాడి చేయగానే.. ఇజ్రాయెల్ తో బలవంతంగా కాల్పుల విరమణను ట్రంప్ అంగీకరింపజేశారని.. ఈ దాడి అనంతరం ఒప్పందం కోసం ట్రంప్ ఇరాన్ ను ప్రాధేయపడ్డారని చెప్పుకొచ్చింది!