నిప్పులు చెరిగిన ప్రెసిడెంట్... ట్రంప్ నోట ఎఫ్*సీకే మాట!
నాటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలు పరస్పరం మళ్లీ దాడులు చేసుకున్న విషయాన్ని ధ్రువీకరించారు.
By: Tupaki Desk | 24 Jun 2025 9:15 PM ISTఇజ్రాయెల్ - ఇరాన్ ల మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులకు శుభం కార్డు పడిందని.. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. ఇరు దేశాలు కూడా ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు ప్రకటనలు చేశాయి. అయినప్పటికీ ఈ రోజు ఇరు దేశాల మధ్య మరోసారి దాడులు కొనసాగాయి. దీంతో... ట్రంప్ ఒక్కసారిగా నిప్పులు చెరిగారు.
అవును.. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య వాతావరణం చల్లబరిచానని.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదిరిందని.. ఇదంతా తన మధ్యవర్తిత్వ ఫలితమని.. పశ్చిమాసియాలో తాను తిరిగి శాంతిని నెలకొల్పానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. ఇరాన్ - ఇజ్రాయెల్ లు కాల్పుల విరమణను ఉల్లంఘించాయనే విషయం తెరపైకి వచ్చింది. దీంతో... ట్రంప్ ఒక్కసారిగా మండిపడ్డారు.
నాటో సదస్సుకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలు పరస్పరం మళ్లీ దాడులు చేసుకున్న విషయాన్ని ధ్రువీకరించారు. ఈ సందర్భంగా... ఇరాన్ తోపాటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘిచిందని అన్నారు. ఇజ్రాయెల్ చర్యపట్ల తాను సంతోషంగా లేనని, టెల్ అవీవ్ శాంతించాలని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో... ఇరాన్, ఇజ్రాయెల్ లు కాల్పుల విరమణను ఉల్లంఘించాయని చెప్పిన ట్రంప్... తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్.. ఆ బాంబులను వేయొద్దని, అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే అవుతుందని.. పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు.
ఆ తర్వాత మరింత స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన ట్రంప్.. ఈ రెండు దేశాలు చాలా కాలంగా ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయని.. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు అని అంటూ... ఎఫ్*సీకే అనే పదప్రయోగం చేశారు. ఈ సందర్భంగా కనురెప్పలు పెద్దవి చేస్తూ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం!
స్పందించిన ఇజ్రాయెల్!:
కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇరాన్ తమపై మూడు చోట్ల క్షిపణి దాడులు చేసిందని.. ప్రతిస్పందనగా అక్కడి రాడార్ వ్యవస్థలపై తాము దాడులు చేశామని ఐడీఎఫ్ వెల్లడించింది. అయితే.. ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన తర్వాత తదుపరి దాడులకు దూరంగా ఉన్నామని వెల్లడించింది.
ఇదే సమయంలో... ట్రంప్ తో మాట్లాడిన తర్వాత తాము దాడులను తగ్గించామని, తదుపరి చేయబోమని నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది. మరోవైపు... తొలుత తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది.