Begin typing your search above and press return to search.

సీజ్ ఫైర్ ఉల్లంఘన... ఇరాన్ కు ఇజ్రాయెల్ ఘాటు హెచ్చరికలు!

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అత్యంత కీలక పరిణామం తాజాగా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Jun 2025 3:25 PM IST
సీజ్  ఫైర్  ఉల్లంఘన... ఇరాన్  కు ఇజ్రాయెల్  ఘాటు హెచ్చరికలు!
X

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అత్యంత కీలక పరిణామం తాజాగా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలను తనదైన శైలిలో అభినందించారు. ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని సూచించారు.

ఈ నేపథ్యంలో.. ఈ ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నట్లు తొలుత ఇరాన్ ప్రకటించింది. ఆ ప్రకటనకు ముందు చివరిగా ఓ ఆరు బాలిస్టిక్ క్షిపణులను టెల్ అవీవ్ పై జారవిడిచినట్లు చెబుతున్నారు. అనంతరం.. ఇజ్రాయెల్ స్పందించింది. కాల్పుల విరమణ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ఇరాన్ దాడులకు పాల్పదిందని ఇజ్రాయెల్ పేర్కొంది.

అవును... గత 12 రోజులుగా పశ్చిమాసియా రగిలిపోతోన్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో అమెరికా కూడా ఎంట్రీ ఇవ్వడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో.. తాజాగా ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే టెహ్రాన్ దాన్ని ఉల్లంఘించిందని టెల్‌ అవీవ్‌ ఆరోపించింది.

ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్)... కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు గంటలకే తమ గగనతలం పైకి ఇరాన్‌ నుంచి బాలిస్టిక్‌ క్షిపణులు దూసుకొచ్చాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్‌ లో సైరన్‌ లు కూడా మోగాయని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించింది.

ఈ విషయాలను ‘ఎక్స్’ వేదికగా రెగ్యులర్ గా అప్ డేట్ చేస్తుంది. ఇదే సమయంలో... ఈ వ్యవహారంపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పందించారు. ఇందులో భాగంగా... కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌ పై గట్టిగా స్పందించాలని తాను ఐడీఎఫ్‌ ను ఆదేశించానని.. టెహ్రాన్‌ కు అతి ముఖ్యమైన ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయాలని సూచించానని వెల్లడించారు.

అయితే.. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత యూదు దేశంపై ఎటువంటి క్షిపణులను ప్రయోగించలేదని ఇరాన్ రాష్ట్ర మీడియా పేర్కొంది. అయితే.. దీనిపై ఇరాన్ విదేశాంగ శాఖ నుంచి కానీ, రక్షణ శాఖ నుంచి కానీ ఎలాంటి అధికారిక స్పందన రాలేదని తెలుస్తోంది.