Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్... ఫోర్డ్ విషయంలో ఇరాన్ ముందే జాగ్రత్త పడిందా?

అవును... ఇరాన్‌ లో అత్యంత కీలకమైన ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని తాము సంపూర్ణంగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు.

By:  Tupaki Desk   |   22 Jun 2025 1:06 PM IST
హాట్  టాపిక్... ఫోర్డ్  విషయంలో ఇరాన్  ముందే జాగ్రత్త పడిందా?
X

అమెరికా బీ-2 స్పిరిట్‌ బాంబర్లతో ఇరాన్‌ పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అత్యంత కీలకమైన ఫోర్డో తో పాటు నతాంజ్‌, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో.. దాడులకంటే ముందే ఫోర్డ్ విషయంలో ఇరాన్ జాగ్రత్త పడిందా అనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ఇరాన్‌ లో అత్యంత కీలకమైన ఫోర్డో అణుశుద్ధి కేంద్రాన్ని తాము సంపూర్ణంగా నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. దానిపై ఏకంగా ఆరు బంకర్‌ బస్టర్‌ బాంబులను ప్రయోగించామని తెలిపారు. అయితే... అమెరికా దాడి చేసే సమయానికే ఫోర్డో నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు.

ఈ అనుమానానికి కారణం ఉపగ్రహ చిత్రాలు అని చెబుతున్నారు. ఇందులో భాగంగా... జూన్‌ 19-20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో ఫోర్డో అణుశుద్ధి కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ట్రక్కులు ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయి. ఈ క్రమంలో.. జూన్‌ 19న సుమారు 16 కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో... ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఈ కేంద్రంపై కచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతో ఇరాన్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని.. ఇందులో భాగంగానే ఫోర్డో లోని కీలకమైన సామగ్రిని, యురేనియం నిల్వలను సురక్షిత ప్రాంతానికి తరలించేసి ఉంటుందని తరలించేసినట్లు అనుమానిస్తున్నారు.

కాగా... అత్యంత కీలకంగా చెప్పే ఫోర్డో అణు స్థావరం టెహ్రాన్‌ నగరానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు. దీన్ని ఓ పర్వతానికి అడుగు భాగాన నిర్మించారు. ఇది ఇరాన్‌ లోని ‘ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌’ (ఐ.ఆర్‌.జీ.సీ) ఆధీనంలోని క్షిపణి కేంద్రంలో ఉంటుంది.

దీని నిర్మాణం 2007లో మొదలైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) చెబుతోంది. అమెరికా, దాని మిత్రదేశాలకు 2009 వరకు ఈ కేంద్రం ఉన్నట్టు సమాచారం లేదట. దీని లొకేషన్‌ ఇజ్రాయెల్‌ కు పెను సవాల్‌ గా మారిందని అంటారు. ఇక్కడ ప్రతి మూడు నెలలకు సుమారు 60 శాతం శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది!