Begin typing your search above and press return to search.

ఆ అణు రియాక్టర్లను అమెరికా ఎందుకు వదిలేసింది.. నెతన్యాహు ఏమన్నారు?

అవును... ఇరాన్‌ లోని మూడు కీలక అణుకేంద్రాలపై దాడులు చేసిన అమెరికా.. ఈ క్రమంలో కీలక పరిశోధన కేంద్రం వద్ద ఉన్న కొన్ని కీలక అణు రియాక్టర్లను మాత్రం ఉద్దేశపూర్వకంగానే వదిలేసిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 3:19 PM IST
ఆ అణు రియాక్టర్లను అమెరికా ఎందుకు వదిలేసింది.. నెతన్యాహు ఏమన్నారు?
X

ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని.. వాటిని తయారు చేసే ప్రయత్నాలు జరగకూడదని ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్"ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి తోడుగా అమెరికా ఎంట్రీ ఇచ్చి "ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్"తో ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. అయితే.. ఈ సమయంలో అమెరికా కావాలనే కొన్ని అణు రియాక్టర్లపై దాడులు చేయకుండా వదిలేసిందనే విషయం తెరపైకి వచ్చింది.

అవును... ఇరాన్‌ లోని మూడు కీలక అణుకేంద్రాలపై దాడులు చేసిన అమెరికా.. ఈ క్రమంలో కీలక పరిశోధన కేంద్రం వద్ద ఉన్న కొన్ని కీలక అణు రియాక్టర్లను మాత్రం ఉద్దేశపూర్వకంగానే వదిలేసిందని అంటున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు కూడా ధ్రువీకరించాయి. అయితే.. అమెరికా యుద్ధ వ్యూహకర్తలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ బలమైన కారణం ఉందని అంటున్నారు.

వాస్తవానికి ఇరాన్ లోని ఇస్ఫహాన్‌ న్యూక్లియర్‌ టెక్నాలజీ అండ్‌ రీసెర్చి సెంటర్‌ లో మూడు పరిశోధన రియాక్టర్లను నిర్వహిస్తున్నారు. ఇవి మినీయేచర్‌ న్యూట్రాన్‌ సోర్సు శ్రేణికి చెందినవని చెబుతున్నారు. ఇవి 900 గ్రాముల బాంబ్‌ గ్రేడ్‌ యురేనియంతో నడుస్తాయి. అయితే.. తాజాగా అమెరికా చేసిన దాడుల్లో ఈ రియాక్టర్లకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు.

అయితే... వాటికి అమెరికా సైన్యం కావాలనే టార్గెట్ చేయలేదని అంటున్నారు. ఒకవేళ ఈ రియాక్టర్ లు దెబ్బతింటే విపరీత పరిణామాలు తలెత్తేవని.. వాటిని నివారించేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకొందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అధికారులు వెల్లడించారు. ఇక్కడ కొద్దిగా అయినా అణుధార్మికత లీకైనా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని వెల్లడించింది!

స్పందించిన నెతన్యాహు:

ఆపరేషన్ రైజింగ్ లయన్ తో మొదలైన లక్ష్యం.. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ తో పూర్తైంది అని నమ్ముతున్నట్లున్న ఇజ్రాయెల్.. తాజా సీజ్ ఫైర్ వ్యవహారంపై స్పందించింది. ఇందులో భాగంగా.. సీజ్ ఫైర్ కు తాము అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా... ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ అన్ని లక్ష్యాలను ఇజ్రాయెల్‌ సాధించిందని తెలిపింది.

ఇదే సమయంలో... ఇరాన్‌ నుంచి పొంచి ఉన్న రెండు ప్రధాన ముప్పులైన.. అణు, బాలిస్టిక్‌ క్షిపణులను తొలగించామని.. ఆపరేషన్‌ లో భాగంగా టెహ్రాన్‌ గగనతలాన్ని ఐడీఎఫ్‌ పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోగలిగిందని.. ఆ దేశ మిలిటరీ నాయకత్వాన్ని తీవ్రంగా దెబ్బకొట్టిందని.. టెహ్రాన్‌ గుండెను ముక్కలు చేసిందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదే సమయంలో ఇరాన్‌ నుంచి పొంచిఉన్న అణుముప్పు తొలగిపోయిందని ఆ ప్రకటనలో పేర్కొన్న నెతన్యాహు కార్యాలయం.. ఇందుకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కు కృతజ్ఞతలు తెలియజేసింది.