గణపతిని చుట్టుముట్టిన బలగాలు..? దండకారుణ్యంలో టెన్షన్ టెన్షన్
ఒకవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టు సానుభూతిపరులు, పౌరహక్కుల నేతల మాటలు చూస్తే ఇంద్రావతి నేషనల్ పార్కు వద్ద ఏదో పెను ఘటన జరిగే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
By: Tupaki Desk | 8 July 2025 6:30 PM ISTఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ దండకారుణ్యంలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ చుట్టూ పోలీసులు భారీగా మోహరించడంపై మావోయిస్టు సానుభూతిపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల కోటగా భావించే దండకారుణ్యంపై గత కొంతకాలంగా భద్రతా బలగాలదే పై చేయి అవుతోంది. గత ఏడాది అక్టోబరు నుంచి భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలు మావోయిస్టులను ఏరివేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యమకారులు భారీగా ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనట్లు మావోయిస్టు సుప్రీం కమాండర్ నంబాల కేశవరావుతోపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంద్రావతి నేషనల్ పార్కును చుట్టుముట్టిన బలగాలు మావోయిస్టులపై మరింత పట్టు బిగించాయని అంటున్నారు.
వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను రూపుమాపుతామని ప్రతిజ్ఞ చేసిన కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా పైచేయి సాధిస్తోంది. ఇక తాజాగా ఇంద్రావతి నేషనల్ పార్కు చుట్టూ సుమారు 25 వేల మందిని మోహరించినట్లు చెబుతున్నారు. ఈ స్థాయిలో బలగాలు చుట్టుముట్టాయంటే మావోయిస్టు అగ్రనేతలు అక్కడ ఉన్నారనే పక్కా సమాచారం పోలీసులకు ఉన్నట్లేనని అంటున్నారు. ప్రధానంగా మావోయిస్టు అగ్రనేత గణపతి, గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరిన కమాండర్ మాడ్వీ హిడ్మా అక్కడ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఒకవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టు సానుభూతిపరులు, పౌరహక్కుల నేతల మాటలు చూస్తే ఇంద్రావతి నేషనల్ పార్కు వద్ద ఏదో పెను ఘటన జరిగే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజంగా మావోయిస్టు అగ్రనేతల ఆచూకీ లభించినప్పుడు, వారికి ముప్పు ఉందని భావించినప్పుడు పోలీసులు, పౌరహక్కుల నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అంటున్నారు. ఇంద్రావతి నేషనల్ పార్కును చుట్టముట్టిన బలగాలు వెంటనే వెనక్కి రావాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం నేత గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేశారు. మావోయిస్టు అగ్రనేతలను బలగాలు చుట్టుముట్టాయని వారు ఆందోళన వెలిబుచ్చారు. ఇక ప్రొఫెసర్ హరగోపాల్ కూడా మావోయిస్టు అగ్రనేతలు గణపతి, హిడ్మాను పోలీసులు చుట్టుముట్టారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మావోయిస్టులు లొంగిపోవాలని లేదంటే చావుకు సిద్ధంగా ఉండాలని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ వ్యాఖ్యలను పౌర హక్కుల నేతలు తప్పుబడుతున్నారు. ఇవన్నీ గమనిస్తే దండకారుణ్యంలో ఏమైనా జరగొచ్చనే టెన్షన్ వాతావరణం నెలకొంది. కొద్ది రోజుల క్రితం ఇవే బలగాలు తెలంగాణ - ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టులను ఏరివేశాయి. ఇప్పుడు వాటి ఫోకస్ దండకారుణ్యంపై పడటంతో మావోయిస్టులు అగ్రనేతల అలికిడిపై సమాచారం ఉండొచ్చని అంటున్నారు.