కెనడాలో భారతీయ దంపతులపై దారుణం.. షాకింగ్ వీడియో
వైరల్ వీడియోలో ముగ్గురు యువకులు ట్రక్‌లో కూర్చొని భారతీయ దంపతులపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు.
By: A.N.Kumar | 13 Aug 2025 12:21 AM ISTకెనడాలో మరోసారి జాతి వివక్ష ఘటన వెలుగుచూసింది. జూలై 29, 2025న లాన్స్‌డౌన్ ప్లేస్ మాల్ పార్కింగ్ ప్రదేశంలో ఓ భారతీయ దంపతులను కెనడియన్ యువకుల గుంపు వేధించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, దానిని చాలామంది ‘హేట్ క్రైమ్’ (జాతి ద్వేష నేరం)గా ఖండించారు.
పీటర్‌బరో పోలీసులు ఆగస్టు 9, 2025న కవార్తా లేక్స్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడిని ఈ ఘటనలో నిందితుడిగా అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం అతనిపై ‘హేట్ క్రైమ్’ సంబంధిత ఆరోపణలు మోపి, షరతులతో విడుదల చేశారు. ఈ కేసు సెప్టెంబర్ 16, 2025న కోర్టులో విచారణకు రానుంది.
వైరల్ వీడియోలో ముగ్గురు యువకులు ట్రక్‌లో కూర్చొని భారతీయ దంపతులపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ కనిపించారు. భారతీయుడు ట్రక్ నంబర్ ప్లేట్ నమోదు చేయడానికి ప్రయత్నిస్తుండగా, వారిలో ఓ యువకుడు “కారులోనుంచి బయటికి వచ్చి నిన్ను చంపుదామా?” అంటూ బెదిరించాడు. మరొకరు అతనిని ‘బిగ్ నోస్’ అంటూ అవమానించగా.. మరో వ్యక్తి కారులోనుంచి దిగిపోయి అసభ్య సంకేతాలు చేశాడు.
కెనడా చట్టంలో ఈ ఘటనకు తగిన ప్రత్యేక ‘హేట్ క్రైమ్’ సెక్షన్ లేకపోయినా.. ఇందులో జాతి ద్వేష అంశం స్పష్టంగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు కోర్టులోకి వెళ్తున్న సమయంలో ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
పీటర్‌బరో పోలీస్ చీఫ్ స్టువార్ట్ బెట్స్ మాట్లాడుతూ “మన సమాజంలో ఇలాంటి ప్రవర్తన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. ఈ ఘటనపై సమాచారం అందించిన ప్రజలకు ధన్యవాదాలు. ఇలాంటి జాతి వివక్ష లేదా ద్వేష నేరాలను తప్పక పోలీసులకు నివేదించాలి. అలా చేస్తే మేము దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. మన సమాజంలో నివసించే, పనిచేసే, సందర్శించే ప్రతి ఒక్కరి భద్రతకు మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు.