యుద్ధ విమానాల నష్టంపై కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందా?
అయితే.. తమకు ఆపరేషన్ సింధూర్ సమయంలో రాజకీయంగా ఎదురైన ఆంక్షల కారణంగా కొన్ని విమానాలను కోల్పోవాల్సి వచ్చిందన్నట్లుగా భారత రక్షణ అధికారి కెప్టెన్ శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 30 Jun 2025 12:30 PM ISTపహల్గాం ఉగ్రదాడి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ లో పాక్ లోని ఉగ్ర శిబిరాలను, ఎయిర్ బేస్ లను, సైనిక స్థావరాలనూ భారత సైన్యం ధ్వంసం చేసింది. అయితే... ఆ యుద్ధంలో భారత్ కు జరిగిన నష్టంపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు! ఈ సమయంలో తెరపైకి వచ్చిన ఓ విషయంపై చర్చ మరోసారి మొదలైంది.
అవును... పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరిట దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తమకు ఆపరేషన్ సింధూర్ సమయంలో రాజకీయంగా ఎదురైన ఆంక్షల కారణంగా కొన్ని విమానాలను కోల్పోవాల్సి వచ్చిందన్నట్లుగా భారత రక్షణ అధికారి కెప్టెన్ శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇవి కాస్తా తీవ్ర సంచలనంగా మారాయి.
ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఈ సమయంలోనే... పార్లమెంట్ ను అత్యవసరంగా సమావేశపరిచి, ఆపరేషన్ సిందూర్ పై చర్చించాలని విపక్షాలు మరింత పట్టుబట్టాయి. అయినప్పటికీ.. మోడీ సర్కార్ స్పందించలేదు. జూన్ 10న ఇండోనేషియా వేదికగా జరిగిన సెమినార్ శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో... తాజాగా జకార్తాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా శివకుమార్ వ్యాఖ్యపై వివరణ ఇచ్చింది. ఇందులో భాగంగా... భారత రక్షణ అధికారి చేసిన వ్యాఖ్యలను చూశామని.. ఆయన చేసిన వ్యాఖ్యలు సందర్భోచితం కాదని తెలిపింది. ఇదే సమయంలో... కొన్ని మీడియాల్లో వేరు చేసి ఉదహరించినట్లుగా ఉందని చెప్పుకొచ్చింది!
ఇదే సమయంలో... ఆయన ఉద్దేశాన్ని తప్పుగా చిత్రీకరించినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించడం గమనార్హం. అదేవిధంగా... మన పొరుగున ఉన్న కొన్ని దేశాల మాదిరిగా కాకుండా.. భారత సాయుధ దళాలు పౌర రాజకీయ నాయకత్వంలో పనిచేస్తాయని ఈ ప్రెజెంటేషన్ తెలియజేస్తోందని.. ఆపరేషన్ సిందూర్ లక్ష్యం పాక్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడమే అని పేర్కొంది.
దీనిపై తాజాగా కాంగ్రెస్ పార్టీ మరోసారి స్పందించింది. ఇందులో భాగంగా... బీజేపీ పాలన జాతీయ భద్రత విషయంలో రాజీ పడిందని.. అందుకే ఈ వివాదంపై చర్చించడానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపక్షాల డిమాండ్ ను అది అంగీకరించలేదని పేర్కొంది. ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... కెప్టెన్ శివ్ కుమార్ చేప్పిన దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. మే 7న పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్న సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను కోల్పోయిందని.. రాజకీయ నాయకత్వం ఇచ్చిన ఆంక్షల కారణంగానే అని చెప్పడం... మోడీ ప్రభుత్వంపై ప్రత్యక్ష నేరారోపణే అని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు!
ఇదే సమయంలో స్పందించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్... మొదట సింగపూర్ లో సీడీఎస్ ముఖ్యమైన విషయాలను వెల్లడిస్తుంది.. ఆ తర్వాత ఇండోనేషియా నుండి సీనియర్ రక్షణ అధికారి ఒకరు విచారణ చేపడతారు.. అయితే, ప్రధాని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలనే డిమాండ్ ను ఎందుకు తిరస్కరించారు?" అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే... భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లోని యుద్ధ విమానాల నష్టంపై మోడీ సర్కార్ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై చర్చించడానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుబడుతోంది!!