'సింధూలో భారతీయుల రక్తం పారుతుంది'... భుట్టో వ్యాఖ్యలు!
ఇలా సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేయడంపై పాక్ రగిలిపోతుంది.
By: Tupaki Desk | 26 April 2025 11:06 AM ISTపహల్గాం దాడిపై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. నిరాయధులైన పర్యాటకులపై ఉగ్రమూకలు కాల్పులు జరిపి 26 మందిని చంపిన ఘటన వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని భారత్ బలంగా నమ్ముతుంది. ఈ సమయంలో.. పాకిస్థాన్ కు దౌత్యపరమైన షాకులిచ్చింది. అందులో ఒకటి.. సింధూ నదీజలాల ఒప్పందం సస్పెండ్ చేయడం!
ఇలా సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేయడంపై పాక్ రగిలిపోతుంది. సింధూ నదీ జలాలు లేకపోతే పాక్ లో చాలా మంది ప్రజలకు తాగు నీరు ఉండదు, మెజారిటీ రైతులకు సాగు నీరు ఉండదు, సుమారు 24% జల విద్యుత్ ఉత్పత్తికి షాక్ తప్పదు. దీంతో... పాక్ పిచ్చెక్కిపోతుంది. ఈ సమయంలో బిలావల్ భుట్టో జర్దారీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అవును... పహల్గాం దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని బలంగా భావిస్తున్న భారత్.. త్వరలో ఊహించని రీతిలో బుద్ది చెబుతామని హెచ్చరించింది. ఈ సమయంలో ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతోంది. మరోపక్క దౌత్యపరమైన షాకిస్తూ.. సింధూ నదీ జలాల ఒప్పందన్ని రద్దు చెసింది. దీనిపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... పహల్గాం దుర్ఘటనకు పాకిస్థాన్ ను దోషిని చేస్తున్నారని.. వారి నిస్సహాయను కప్పిపుచ్చుకోవడానికి పాకిస్థాన్ ను నిందిస్తున్నారని అన్నారు. అందువల్లే.. సింధూ నదీ జలాలను నిలిపేశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. సింధు నాగరికతకు పాక్ నిజమైన సంరక్షకుడని.. "మా నీరు లేదా వారి రక్తం దాని గుండా ప్రవహిస్తుంది" అని అన్నారు.
ఈ సందర్భంగా... సింధూ నది తమదని.. అది తమదే అవుతుందని.. తమ నీరు దాని గుండా ప్రవహిస్తుందని.. లేదంటే, వారి రక్తం ప్రవహిస్తుందని భుట్టో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అన్నారు.
మరోపక్క జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రదాడి వెనుక తమ హస్తం ఉందంటూ భారత ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలను పాకిస్థాన్ తోసిపుచ్చింది. ఈ ఉగ్ర ఘటనను తమ దేశానికి ముడిపెట్టడం తగదంటూ పాక్ పార్లమెంట్ లోని ఎగువసభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది.