Begin typing your search above and press return to search.

ఎమ‌ర్జెన్సీ అస‌లెందుకు విధించారు..?.. ఈ విష‌యాలు తెలుసా?

ఎమ‌ర్జెన్సీ. ఈ మాట అన్నా.. విన్నా.. 1975-77 మ‌ధ్య దేశంలో అధికారికంగా జ‌రిగిన అనేక అకృత్యాలు క‌ళ్ల ముందుకు వ‌స్తాయి.

By:  Tupaki Desk   |   24 Jun 2025 4:18 PM IST
ఎమ‌ర్జెన్సీ అస‌లెందుకు విధించారు..?.. ఈ విష‌యాలు తెలుసా?
X

ఎమ‌ర్జెన్సీ. ఈ మాట అన్నా.. విన్నా.. 1975-77 మ‌ధ్య దేశంలో అధికారికంగా జ‌రిగిన అనేక అకృత్యాలు క‌ళ్ల ముందుకు వ‌స్తాయి. ఒక‌టా రెండా.. అనేక అకృత్యాలు ఆనాడు జ‌రిగాయ‌ని నాయ‌కులు రాసిన పుస్త‌కాలే కాదు.. చ‌రిత్ర ప‌రిశోధ‌కులు రాసిన గ్రంధాల్లోనూ తెలుస్తాయి. రాజ్యాంగం అంద‌రికి అన్నీ ఇచ్చింది. స్వేచ్ఛ‌, స‌మాన‌త్వం ప్ర‌సాదించింది. ఇదే రాజ్యాంగంలో కీల‌క‌మైన 352 (1) ఆర్టిక‌ల్ ఎమ‌ర్జెన్సీని కూడా ప్ర‌సాదించింది. అయితే.. ఇది దుర్వినియోగం అవుతుంద‌ని కానీ.. ప్ర‌జ‌ల‌ను రాచి రంపాన పెడుతుంద‌ని కానీ.. నాటి రాజ్యాంగ క‌ర్త‌లు ఊహించ‌లేదు. ఇదే.. ఆనాటి ప్ర‌ధాని ఇందిర‌మ్మ‌కు ఆయుధంగా మారింది. ఎమ‌ర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తియిన నేప‌థ్యంలో.. ప్ర‌త్యేక క‌థ‌నం..

అస‌లెందుకు విధించారు..?

దేశంలో ఎమ‌ర్జెన్సీని విధించ‌డానికి ఒకే ఒక్క కార‌ణం.. ప్ర‌ధానిగా ఉన్న ఇందిర‌మ్మ ఎన్నిక చెల్ల‌ద‌ని అల హాదాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వ‌డ‌మే. ఆశ్చ‌ర్యంకాదు.. నిజం. 1971లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇందిర మ్మ ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతేకాదు.. ఆ ఎన్నిక‌ల్లో ఆమె `గ‌రీబీ హ‌ఠావో`(పేద‌రిక నిర్మ‌ల‌న‌)పిలుపునిచ్చారు. దీంతో ప్ర‌జ‌లు కుప్పుల తెప్ప‌లుగా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపారు. ఫ‌లితంగా 352 పార్ల‌మెంటు స్థానాల్లో కాంగ్రెస్ విజ‌యం ద‌క్కించుకుని చ‌రిత్ర‌ను తిరగ రాసింది.

అయితే.. ఇందిరా గాంధీపై రాయ్ బ‌రేలి నియోజ‌క‌వ‌ర్గం నుంచి సోష‌లిస్టు పార్టీ నాయ‌కుడు రాజ్ నారాయ ణ్ పోటీ చేసి ఓడిపోయారు. ఇందిర‌మ్మ‌కు 1.83 ల‌క్ష‌ల ఓట్లు వ‌స్తే.. రాజ్‌కు 71,499 ఓట్లు వ‌చ్చాయి. ఇప్ప‌టి మాదిరిగానే.. అప్ప‌ట్లోనూ ముంద‌స్తు ఎన్నిక‌ల చ‌ర్చ ఉండేది. ప్రీపోల్ సర్వేల్లో రాజ్ విజ‌యం ప‌క్కా అని తేలింది. కానీ.. ఆయ‌న చిత్తుగా ఓడిపోయారు. ఇక‌, ఎమ‌ర్జెన్సీకి.. ఇక్క‌డే బీజం ప‌డింది. ఎన్నిక‌ల్లో త‌న‌పై గెలిచిన ఇందిర‌మ్మ‌ది `నిజాయితీ విజ‌యం` కాదంటూ...రాజ్ నారాయ‌ణ్ యూపీలోని అల‌హాబాద్ కోర్టులో పిటిష‌న్ వేశారు.

అవినీతికిపాల్ప‌డ్డార‌ని..ఎన్నిక‌ల అధికారుల‌ను కొనుగోలు చేశార‌ని. ఇంటింటికీ డ‌బ్బులు పంచార‌ని ఆయన ఆధారాల‌తో స‌హా నిరూపించారు. కానీ.. అప్ప‌టికే ఇందిర‌మ్మ ప్ర‌ధాని కావ‌డం.. గ‌మ‌నార్హం. ఇక‌, అల‌హాబాద్ హైకోర్టు ఇందిర‌మ్మ అవినీతికి పాల్ప‌డే గెలిచార‌ని.. ఆమె ఎన్నిక చెల్ల‌ద‌ని.. త‌క్ష‌ణం రాజీనామా చేయాల‌ని 1975, జూన్ 12న‌ తీర్పు ఇచ్చింది. దీంతో హుటాహుటిన ఇందిర సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అక్క‌డ కూడా ఎదురు దెబ్బే త‌గిలింది. ఇందిర అవినీతికి పాల్ప‌డ్డార‌ని.. ఓట‌ర్లకు డ‌బ్బులు పంచార‌ని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది.

అయితే.. ఆమెకు ఉన్న ప్ర‌త్యేక స‌దుపాయాల‌ను మాత్ర‌మే ర‌ద్దు చేస్తున్నామ‌ని.. జీతం భ‌త్యం లేని ప్ర‌ధానిగా ఆమె కొన‌సాగ‌వ‌చ్చ‌ని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు 1975, జూన్ 25న సాయంత్ర 6 గంట‌ల‌కు సుప్రీంకోర్టు వెలువ‌రిచింది. నిజానికి అప్ప‌టికే మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు దేశం రెడీ అవుతోంది. మ‌రికొన్ని నెల‌ల్లో ఎన్నిక‌లు ఉన్నాయ‌న‌గా.. వ‌చ్చిన తీర్పుతో దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ త‌ప్ప‌.. అన్ని పార్టీల వారూ సంబ‌రాలు చేసుకున్నారు. దీంతో ర‌గిలిపోయిన ఇందిర‌మ్మ‌.. ప‌ట్ట‌రాని ఆవేశానికి గుర‌య్యారు.

ఈ క్ర‌మంలోనే సుప్రీం తీర్పు వ‌చ్చిన కొన్ని గంట‌ల్లో అంటే.. 1975, జూన్ 25న రాత్రి 11.45 నిమిషాల‌కు దేశంలో ఆర్టికల్ 352(1) ప్ర‌కారం.. ఎమ‌ర్జెన్సీ విధిస్తున్న‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనిని అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ఫ్ర‌కృద్దీన్ అలీ అహ్మ‌ద్ ఏమాత్రం ఆలోచ‌న లేకుండా.. క్ష‌ణాల్లో ఆమోదించారు. అంతే.. అప్ప‌టి వ‌ర‌కు సంబ‌రాల్లో మునిగి తేలిన నాయ‌కులు తెల్లారేస‌రికి జైళ్ల‌లో ఉన్నారు. ఇందిర‌మ్మ‌కు, ఆమె నిర్ణ‌యాల‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాసిన ప‌త్రిక‌ల‌ను మూసేశారు.

అంతేకాదు.. ప‌త్రిక‌ల‌కు సెన్సార్ షిప్‌ను క‌ఠినంగా అమ‌లు చేశారు. అంటే.. ప‌త్రిక‌లు ముద్రించాక‌.. వాటిని సెన్సార్ బోర్డుకు పంపించి.. అక్క‌డ అనుమ‌తి తీసుకుంటేనే ప్ర‌జాబాహుళ్యంలోకి వ‌దిలి పెట్టారు. ప్ర‌జ‌ల భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై ఉక్కుపాదం మోపారు. ప్రాధ‌మిక హ‌క్కుల‌ను నిర్వీర్యం చేశారు. ఇలా రెండేళ్ల పాటు దేశంలో అనేక అకృత్యాలు జ‌రిగాయి. మ‌న తెలుగు నాయ‌కులు(వెంక‌య్య‌నాయుడు వంటివారు) కూడా జైళ్ల‌కు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఇదీ.. ఎమ‌ర్జెన్సీకి కార‌ణ‌మైన అస‌లు ఘ‌ట్టం. నేటికి దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించి 50 సంవ‌త్స‌రాలు పూర్త‌య్యాయి.