పాక్ కు భారత్ బిగ్ స్కెచ్.. అదే జరిగితే బొట్టు బొట్టుకూ చుక్కలే!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యకంటే ముందు దౌత్యపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Jun 2025 11:27 PM ISTపహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యకంటే ముందు దౌత్యపరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 1960లో భారత్ – పాక్ లు సంతకం చేసిన సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ సమయంలో ఆ ఒప్పందం రద్దు నిర్ణయానికి పూర్తి న్యాయం జరిగే దిశగా భారత్ అడుగులు వేస్తోంది.
అవును... పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ తీసుకున్న సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు నిర్ణయానికి కొనసాగింపు చర్యలు చేయపడుతోంది భారత్. ఇందులో భాగంగా.. ఇప్పటికే జమ్మూకశ్మీర్ లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని చెబుతోన్న వేళ.. మరో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా... సింధు నదీ జల వ్యవస్థలోని మూడు పశ్చిమ నదుల నుండి మిగులు ప్రవాహాన్ని హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించడానికి.. 113 కి.మీ పొడవైన కాలువను నిర్మించడానికి భారత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనాన్ని నిర్వహిస్తోందని జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.
చినాబ్ ను రవి - బియాస్ – సట్లేజ్ వ్యవస్థతో అనుసంధానించే కాలువ నిర్మాణ పనులు రాబోయే మూడేళ్లలో పూర్తవుతాయని భావిస్తున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన హోంమంత్రి అమిత్ షా... మూడేళ్ల లోపు సింధూ జలాలను కాలువల ద్వారా రాజస్థాన్ లోని గంగానగర్ కు తీసుకెళ్తామని తెలిపారు.
అప్పుడు పాకిస్థాన్ ప్రతీ నీటి చుక్క కోసం తహతహలాడుతుందని షా అన్నారు. ఇదే సమయంలో.. దీనిని యమునా నదికి అనుసంధానించే ప్రతిపాదన కూడా ఉందని.. అలా జరిగితే కాలువ పొడవు 200 కి.మీ అవుతుందని అంటున్నారు. ఈ పథకం వల్ల ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఎంతో ప్రయోజనం పొందుతాయని భావిస్తున్నారు.
కాగా... భారత్ ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ.. "నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు", "ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి జరగవు" అని నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే.