ఫ్యాక్ట్ చెక్... ఇరాన్ కోసం భారత గగనతలాన్ని అమెరికా వాడుకుందా?
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య తీవ్ర ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Jun 2025 1:04 PM ISTఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య తీవ్ర ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్ పై ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదనే లక్ష్యంతో ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ కి తోడు అమెరికా కూడా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ మొదలుపెట్టింది. ఇరాన్ లోని మూడు కీలక అణుకేంద్రాలపై దాడులు చేసింది.
ఇందులో భాగంగా... ఇరాన్ లోని ఫోర్డో తో పాటు నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు, తోమహాక్ క్రూయిజ్ క్షిపణులతో అమెరికా విరుచుకుపడింది. 25 నిమిషాల్లో ఈ పని పూర్తి చేసినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్.. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించకుండానే చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు
ఈ సమయంలో భారత గగనతలాన్ని యూఎస్ ఉపయోగించుకుందనే ప్రచారం మొదలైంది. ఇరాన్ పై ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ చేపట్టడం కోసం అగ్రరాజ్యం అమెరికా.. భారత గగనతలాన్ని ఉపయోగించుకుందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని కేంద్రం తీవ్రంగా ఖండించింది.
అవును... ఇరాన్ పై దాడులు చేయడానికి భారత గగనతలాన్ని అమెరికా ఉపయోగించుకుందనే ప్రచారాన్ని కేంద్రం తీవ్రంగా ఖండించింది. అవి పూర్తిగా తప్పుడు వార్తలుగా 'పీఐబీ ఫ్యాక్ట్ చెక్' ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఇందులో భాగంగా... ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ సమయంలో భారత గగనతలాన్ని అమెరికా ఉపయోగించలేదని తెలిపింది.
ఇదే సమయంలో... ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ లో భాగంగా ఇరాన్ పై దాడులు చేసేందుకు అమెరికా విమానాలు పయనించిన మార్గాలను ఆ దేశ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ మీడియా సమావేశంలోనూ వివరించారని స్పష్టం చేసింది.