హైదరాబాద్ లో బాంబు బెదిరింపు మెయిల్స్... పలు ప్రాంతాల్లో తనిఖీలు
హైదరాబాద్ లో బాంబు బెదిరింపుల కలకలం... పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
By: Tupaki Desk | 8 July 2025 3:28 PM ISTహైదరాబాద్ లో బాంబు బెదిరింపుల కలకలం... పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గవర్నర్ నివాసం రాజ్ భవన్, పాత బస్తీలోని సిటీ సివిల్ కోర్టు, జింఖానా క్లబ్, సికింద్రాబాద్ సివిల్ కోర్టులలో బాంబులు పెట్టినట్లు మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు. దుండగులు కోర్టులనే లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది.
సిటీ సివిల్ కోర్టులో కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. కాగా, అన్నా వర్సిటీ పూర్వ విద్యార్థుల పేరుతో మంగళవారం తెల్లవారుజామున 3.43 గంటలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. సివిల్ కోర్టు, జడ్జిల చాంబర్లతో పాటు జింఖానా క్లబ్ లో నాలుగు ఆర్డీఎక్స్ బేస్డ్ ఐఈడీలు పెట్టినట్లు అబిదా అబ్దుల్లా ఎట్ హాట్ మెయిల్.కామ్ నుంచి సిటీ సివిల్ కోర్ట్, జింఖానా క్లబ్ అధికారులకు మెయిల్ వచ్చింది.
ఈ-మెయిల్‌లో ఆగంతకుడు తీవ్రమైన, విచిత్రమైన ఆరోపణలు చేశాడు. 2021లో డీఎంకే సర్కారు మీడియాను ప్రభావితం చేసుందుకు కుట్రలు పన్నిందని ఆరోపించాడు. కొందరు జర్నలిస్టులపై చిన్నారులను అడ్డం పెట్టుకుని మానసికంగా, శారీరకంగా వేధించారని బలవంతంగా డ్రగ్స్ కూడా ఇచ్చారని పేర్కొన్నారు.
కాగా, గత కొన్నేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లో బాంబు బెదిరింపుల కలకలం వస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరు, ఢిల్లీలో ఈ తరహా బెదిరింపులు వచ్చినా అవి ఉత్తుత్తివే అని తేలింది. ఇప్పుడు హైదరాబాబాద్ లోనూ బెదిరింపులు వచ్చాయి. అయితే, గతంలోని పరిణామాల రీత్యా పోలీసు అధికారులు హై అలర్ట్ అయ్యారు.