అర్థరాత్రి వేళ పాక్ మీద ఆ ఎంపీ చెణుకులు.. చదివి తీరాలంతే
ఇంతకూ ఆ ఎంపీ ఎవరు? ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆయన చెప్పిన మాటల్ని అస్సలు మిస్ కాకూడదనిపించటం ఖాయం.
By: Garuda Media | 30 July 2025 10:37 AM ISTఆపరేషన్ సిందూర్ మీద లోక్ సభలో హాట్ హాట్ చర్చ జరిగిన విషయం తెలిసిందే. అధికార.. ప్రతిపక్ష నేతల మాటల తూటాలతో సభ వేడెక్కిపోయింది. ఈ అంశంపై చర్చ సోమవారం రాత్రి వరకు సాగింది. ఈ అంశంపై అప్పటికే బోలెడంత సమాచారం రావటంతో మీడియా ఫోకస్ అంతా.. తమ చేతిలో ఉన్న సమాచారం మీదా..దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలన్న దాని మీదే ఉంది. ఇలాంటి వేళ.. ప్రధాన మీడియా పెద్దగా పట్టించుకోని ఒక ఎంపీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనికి కారణం.. సదరు ఎంపీ సోమవారం పొద్దుపోయిన తర్వాత మాట్లాడటమే.
ఇంతకూ ఆ ఎంపీ ఎవరు? ఆయన చేసిన వ్యాఖ్యలు ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆయన చెప్పిన మాటల్ని అస్సలు మిస్ కాకూడదనిపించటం ఖాయం. ఆయన ఎవరూ కాదు రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ అధ్యక్షుడు కం ఎంపీ హనుమాన్ బేణివాల్. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలతో సభలోని అన్ని పార్టీల వారు సరదాగా నవ్వుకోవటమే కాదు.. అప్పటివరకు వాడి వేడిగా సాగిన చర్చకు వేడెక్కిపోయిన లోక్ సభ కాస్త నవ్వులతో చల్లబడింది.
ఆపరేషన్ సిందూర్ పేరుతో చేపట్టిన దాడులతో పాక్ ను మోకాళ్ల మీద కూర్చోబెట్టామన్న ఆయన.. ‘‘భీకర దాడులతో పాక్ ను మోకాళ్లపై కూర్చోబెట్టాం. ఈ ఆపరేషన్ కు సిందూర్ పేరు పెట్టాం. అంటే.. పాకిస్తాన్ నుదిటిపైన సిందూరం అద్దినట్లే. హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు పవిత్ర సిందూరాన్ని తమ భర్తగా భావిస్తారు. పాకిస్తాన్ పై భారత్ సిందూరం పెట్టింది కాబట్టి పాకిస్తాన్ ధర్మపత్నిగా మారిపోయినట్లే. ఇక వధువును తోడ్కొనిరావటం ఒక్కటే మిగిలి ఉంది. దయచేసి మీరు వెళ్లి.. పాకిస్తాన్ ను ఇంటికి తీసుకురండి’’ అన్న వ్యాఖ్యలతో సభ మొత్తం పార్టీలకు అతీతంగా నవ్వులు విరిసాయి.
ఇలాంటి వేళలోనూ సభాపతి స్థానంలో ఉన్న వారు మాత్రం.. ఇప్పటికే మీకిచ్చిన టైం దాటిపోయింది.. త్వరగా మాట్లాడాలని సూచన చేయగా.. బేణివాల్ మరోసారి తనదైన చమత్కారాన్ని ప్రదర్శించారు. ‘అర్థరాత్రి సమయంలో మాట్లాడే అవకాశం ఇచ్చారు అధ్యక్షా. నా ప్రసంగం రేపు పత్రికల్లో పబ్లిష్ కాదు. ఇక సోషల్ మీడియాను మేనేజ్ చేసుకోవాల్సిందే’ అంటూ ఆయన చెణుకులకు (చమత్కారానికి) సభలో మరోసారి నవ్వులు విరిసాయి. ఆయన.. మాటలకు ప్రధాన మీడియాలో చోటు లభించనప్పటికి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆయన వ్యాఖ్యలు.. రోజు ఆలస్యంగా ప్రధాన మీడియాలోనూ ప్రత్యేకంగా అచ్చు అయ్యాయి. మొత్తానికి బేణీవాల్ చెణుకులు అదిరేలా ఉన్నాయని మాత్రం చెప్పక తప్పదు.