జగన్ కి కాపు కాస్తారా ?
ఏపీలో రాజకీయం మెల్లగా మారుతోంది. రాజకీయాల్లో భావోద్వేగాలు బాగా జోరుగా పనిచేస్తాయి.
By: Tupaki Desk | 8 July 2025 5:00 PM ISTఏపీలో రాజకీయం మెల్లగా మారుతోంది. రాజకీయాల్లో భావోద్వేగాలు బాగా జోరుగా పనిచేస్తాయి. వాటి వల్ల ఫలితాలు మారిపోతాయి. అయితే అలా వచ్చిన ఫలితాలను విజయాలను జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని సుస్థిరం చేసుకుంటే రాజకీయం స్పీడెక్కుతుంది. పార్టీకి పది కాలలకు సరిపడా పటిష్టత చేకూరుతుంది. లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.
ఇక ఏపీలో రాజకీయాన్ని టర్న్ చేసేది పూర్తిగా గోదావరి జిల్లాలే అన్నది తెలిసిందే. ఈ జిల్లాలు కనుక ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే ఎంతటి మహామహులైనా కూడా చతికిల పడాల్సిందే ఎంతటి ఘనమైన విజయాలు సాధించిన పార్టీ అయినా నేల చూపులు చూడాల్సిందే.
ఇది అనేకసార్లు రుజువు అయింది. ఇక చూస్తే 2024 లో కూడా వైసీపీ ఘోర పరాజయానికి టీడీపీ కూటమి అద్భుతమైన విజయానికి గోదావరి జిల్లాలు కీలక పాత్ర పోషించాయి. అక్కడ ఉన్న బలమైన సామాజిక వర్గం వన్ సైడెడ్ గా కూటమి వైపు మొగ్గు చూపించడంతో వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు దక్కలేదు. వారాహి సభలలో పవన్ ఇచ్చిన నినాదం వైసీపీకి ఒక్క సీటూ దక్కరాదని, అది బ్రహ్మాండంగా పనిచేసింది.
అయితే గిర్రున ఏడాది తిరిగాక ఇపుడు గోదావరి రాజకీయం ఎలా ఉంది అన్న చర్చకు వస్తే కనుక మెల్లగా కొంత మార్పు వస్తోంది అని అంటున్నారు. హాట్ ఫేవరేట్ గా ఉన్న జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వంలో అతి ముఖ్య పాత్రతో పాటు ఏదో నాటికి పవన్ సీఎం అవుతారు అన్న ఆశతో మద్దతుగా నిలిచిన బలమైన సామాజిక వర్గం ఇపుడు ఏ రాయి అయితేనేంటి అన్న వేదాంత చింతనలో పడిందని అంటున్నారు.
ఏపీలో ఎలా చేసినా ఏమి చేసినా వస్తే చంద్రబాబు లేకపోతే జగన్ మాత్రమే సీఎంలు అవుతున్నారు అన్నది విభజన తరువాత గత మూడు ఎన్నికలూ నిరూపించాయి. ఇక కొత్తగా జనసేన మంచి విజయాన్ని 2024 ఎన్నికల్లో సొంతం చేసుకున్నా పవన్ కి ఉప ముఖ్యమంత్రి పదవి మాత్రమే దక్కింది. ఉప ముఖ్యమంత్రి పదవి బలమైన సామాజిక వర్గానికి కొత్త కాదు. ఎందరో ఆ పదవిని చేపట్టారు.
దాంతో కుంభస్థలాన్ని కొట్టాలీ అన్న తమ లక్ష్యం ఇంకా సుదీర్ఘంగానే ఉంది అన్నది కూడా అర్ధం అవుతోంది అంటున్నారు. చంద్రబాబే మరో 15 ఏళ్ల పాటు సీఎం గా ఉండాలని పవన్ కళ్యాణ్ ఇస్తున్న స్టేట్మెంట్స్ పరి పరి విధాలుగా ఆలోచనలు ఆ సామాజిక వర్గంలో కలుగచేస్తున్నాయని అంటున్నారు. ఇక కూటమి పేరుతో అంతా ఒక చోట చేరాక రాజకీయం కూడా వన్ సైడ్ గా మారాక రెండో వైపు ఏ విధంగాను సర్దుకునేందుకు చాన్స్ లేకుండా పోయింది అని మధన పడుతున్న వారు ఉన్నారు.
కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులు చేపట్టాలనుకున్న వారికి మూడు పార్టీల వల్ల మిత్రుల వాటా వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటివి కూడా చాలా మందిలో వేరే ఆలోచనలు కలుగచేస్తున్నాయని అంటున్నారు. సీఎం సీటు దక్కనపుడు పదవులు కుదించుకోవడం ఎందుకు అన్న చర్చ కూడా సాగుతోంది. దాంతో దారుణంగా ఓడించిన వైసీపీ వైపు కొంతమంది చూపు పడుతోంది అంటున్నారు.
ఎన్నిక ఎన్నికకూ తేడాను చూపిస్తూ విలక్షణమైన తీర్పు ఇచ్చే గోదావరి జిల్లాలు ఈసారి కూడా తమ మార్క్ చూపిస్తాయని అంటున్నారు. వైసీపీలో కూడా కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ ఆలోచనలు చేస్తున్నారు ఇక గోదావరి జిల్లాల బాధ్యతలను రీజనల్ కో ఆర్డినేటర్ గా అక్కడ ఉన్న సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అప్పగించారు. దాంతో ముందుగా గోదావరి జిల్లాల నుంచే నరుక్కు రావాలని వైసీపీ చూస్తోంది అంటున్నారు.
ఇక లోతుగా విశ్లేషించుకుంటే రాజకీయం ఎపుడూ ఒక్కలా ఉండదు, అది పారే నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది అలా చూస్తే కనుక వైసీపీ మంచి రోజుల కోసం తపన పడుతోంది. తమకు బలమైన ఆసరా దొరకాలని కోరుకుంటోంది. కాపు కాసే వారి కోసం అన్వేషిస్తోంది. రాజకీయంగా వస్తున్న మార్పులు వైసీపీకి ఏ మాత్రం అనుకూలంగా మారిగా గోదావరి తీరంలో తిరిగి ఫ్యాన్ రెక్కలు తిరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.