Begin typing your search above and press return to search.

చంద్రబాబు కెరీర్ లోనే హైలెట్.. విశాఖ సదస్సు వెరీవెరీ స్పెషల్..

ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ సదస్సులో ఏపీ దశ తిరిగిపోయేలా కీలక ఒప్పందాలు జరగనున్నాయనే ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   6 Nov 2025 8:00 PM IST
చంద్రబాబు కెరీర్ లోనే హైలెట్.. విశాఖ సదస్సు వెరీవెరీ స్పెషల్..
X

ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటికల్ కెరీర్ లోనే విశాఖలో నిర్వహించనున్న సీఐఐ సదస్సు హైలెట్ గా నిలవనుందనే ప్రచారం జరుగుతోంది. పెట్టుబడుల వేటలో భాగంగా విశాఖ సీఐఐ సమ్మిట్ ను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సీఎం.. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి వందల మంది పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. చంద్రబాబు సుదీర్ఘ అనుభవం, పెట్టుబడులు, పారిశ్రామిక ప్రోత్సహాకాల్లో ఆయనకు ఉన్న ట్రాక్ రికార్డుతో విశాఖ సదస్సుకు వచ్చేందుకు ఓకే అన్న పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సూచన ప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు.

ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు జరగనున్న సీఐఐ సదస్సులో ఏపీ దశ తిరిగిపోయేలా కీలక ఒప్పందాలు జరగనున్నాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ తోపాటు మంత్రులు నారాయణ, దుర్గేశ్, బీసీ జనార్దనరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు 30 దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణంతోపాటు పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను వివరించారు. దీంతో సుమారు 300 మంది పారిశ్రామిక వేత్తలు విశాఖ వచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. మొత్తం 45 దేశాల నుంచి 12 మల్టీ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడా ఈ సదస్సుకు వస్తున్నారు. సుమారు 410 ఎంవోయూలు కుదుర్చుకోబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మొత్తం రూ.9.8 లక్షల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాలు రానున్నాయని చెబుతున్నారు. వీటిద్వారా ఏపీ రూపు రేఖలు మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో 16 నెలల్లో రూ.10 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి. వీటికి అదనంగా సీఐఐ సదస్సులో మరో పది లక్షల కోట్లకు ఒప్పందాలు జరగనున్నాయి. దీంతో ఏపీలో మొత్తం రూ.20 లక్షల కోట్లతో కొత్త పరిశ్రమలు రానున్నాయని అంటున్నారు. జాబ్ ఫస్ట్ నినాదంతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానంలో పరిశ్రమలకు అనుమతిచ్చేలా ప్రభుత్వం సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే ఏపీలో గూగుల్ డేటా సెంటర్ తోపాటు రామాయపట్నం బీపీసీఎల్ రిఫైనరీ, ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ వంటి సంస్థలు భారీ పెట్టుబడులు ప్రకటించాయి. అదేవిధంగా టీసీఎస్ ఈ నెలలో కొత్త సర్వీస్ సెంటర్ ప్రారంభిస్తోంది. తిరుపతిలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అమరావతిలో జనవరి నాటికి క్వాంటం కంప్యూటర్ అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా రాష్ట్రం నలువైపులా ఏదో ఒక పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.