8 నెలల్లో 4వ సారి.. అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
తాజాగా ఈ ఆలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి చేశారు. ఈ విషయాన్ని ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది.
By: Tupaki Desk | 13 Aug 2025 7:51 PM ISTఇంగ్లండ్ లో భారత ఎంబసీ... ఆస్ట్రేలియాలో దాడులు.. కెనడాలో విద్వేష వ్యాఖ్యలు...కొన్నాళ్లుగా భారత వ్యతిరేక శక్తుల లక్ష్యంగా మారిన అంశాలు.. ఖలిస్థానీ వేర్పాటువాదులు కొన్నాళ్లుగా కెనడాలో తరచూ ఆందోళనలు చేస్తూ తమ ఉనికి చాటుకుంటున్నారు. అక్కడి ఆలయాలపై దాడులకూ పాల్పడిన ఉదంతాలు ఉన్నాయి. అయితే, తాజాగా అమెరికాలో ఆలయంపై దాడి జరిగింది.
అమెరికాలో భారత సంతతి ప్రజలు అధికం అనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడివారు తమ మనోభావాలకు అనుగుణంగా ఆలయాల నిర్మాణం చేపడుతున్నారు. లేదంటే హిందూ ధార్మిక సంఘాలు ముందుకొచ్చి నిర్మాణం చేపడుతున్నాయి. ఇలా నిర్మితమైనదే ఇండియానా రాష్ట్రం జాన్సన్ కౌంటీలోని అక్షర్ పురుషోత్తమ్ స్వామి నారాయణ్ ఆలయం.
తాజాగా ఈ ఆలయంపై ఖలిస్థానీ వేర్పాటువాదులు దాడి చేశారు. ఈ విషయాన్ని ది హిందూ అమెరికన్ ఫౌండేషన్ ట్వీట్ చేసింది. ఇదే సమయంలో ఖలిస్థాన్ కు మద్దతుగా, భారత్ కు వ్యతిరేకంగా ఆలయంపై విద్వేష నినాదాలు రాశారని పేర్కొంది. ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేసింది. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటివరకు నాలుగోది..
ప్రస్తుత ఘటనను కలుపుకొంటే, 2025లో అమెరికాలోని హిందూ ఆలయాలపై నాలుగు దాడులు జరిగాయి. మార్చిలో దక్షిణ కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత ఆలయంపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో మున్ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. భద్రతా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. స్వామి నారాయణ్ ఆలయంపై దాడి ఘటనలో కేసు నమోదైంది. భారత వ్యతిరేక శక్తుల హస్తంపై దర్యాప్తు సాగుతోంది. ఆలయాపై వరుస దాడుల పట్ల హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలోని ఆలయాలకు తగిన భద్రత కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది.