Begin typing your search above and press return to search.

‘డబ్బు లేకుండా పహల్గాం దాడి జరిగేది కాదు’.. ఏమిటీ ఎఫ్ఏటీఎఫ్..?

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 25 మంది ప్రయాణికులు, ఒక స్థానికుడు మృతి చెందిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Jun 2025 11:28 PM IST
‘డబ్బు లేకుండా పహల్గాం దాడి జరిగేది కాదు’.. ఏమిటీ ఎఫ్ఏటీఎఫ్..?
X

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 25 మంది ప్రయాణికులు, ఒక స్థానికుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్ సహా ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గళం విప్పాయి! మరోపక్క సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తోందని పాక్ పై భారత్ తీవ్ర విమర్శలు గుప్పించింది.

అనంతరం ప్రతీకార చర్యల్లో భాగంగా.. దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. సైనిక చర్యలో భాగంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాక్, పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. ఈ సమయంలో.. పహల్గాంలో ఉగ్రదాడి ఉగ్రవాదులకు, ఉగ్రవాద మద్దతుదారుల మధ్య నిధుల తరలింపు మార్గాలు లేకుండా సాధ్యం కాదని ఎఫ్ఏటీఎఫ్ పేర్కొంది.

అవును... పహల్గాం ఉగ్రదాడులు.. ఉగ్రవాద మద్దతుదారుల మధ్య నిధుల తరలింపు మార్గాలు లేకుండా సాధ్యం కాదని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) పేర్కొంది. ఇదే సమయంలో... ఉగ్ర కార్యకలాపాలకు నిధుల తరలింపును అడ్డుకునేందుకు దేశాలు తీసుకున్న చర్యలపై మరింత దృష్టి సారించినట్లు వెల్లడించింది.

ఈ సందర్భంగా... ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం సహా టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులపై త్వరలో ఓ నివేదికను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 22 న పహాల్గాంలో జరిగిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొంది.

ఇదిలా ఉండగా.. ఉగ్రచర్యలపై ఎఫ్ఏటీఎఫ్ నుంచి ఇలాంటి ఖండన అరుదైనదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత దశాబ్ధకాలంలో ఇలా ఓ ఉగ్రదాడిని ఖండించడం ఇది మూడోసారి మాత్రమేనని వెల్లడించాయి. ఉగ్రవాదానికి పాక్ అన్ని విధాలా అండగా నిలుస్తోందని భారత్ ఆరోపిస్తున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 24 దేశాలు గ్రే లిస్టులో ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాలపై ఎఫ్ఏటీఎఫ్ పర్యవేక్షణ అధికంగా ఉంటుంది. వాస్తవానికి 2008, 2012, 2018లలో పాకిస్థాన్ ఈ లిస్ట్ లో ఉంది. అయితే.. 2022లో ఈ లిస్ట్ నుంచి బయటపడింది. దీంతో... ఎఫ్ఏటీఎఫ్ తాజా వ్యాఖ్యలతో పాక్ త్వరలో మరోసారి గ్రే లిస్ట్ లో చేరే అవకాశాలున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి.