పెళ్లికాని ప్రసాదులూ జర జాగ్రత్త.. పెళ్లి కోసం తొందర పడ్డారో మునిగిపోతారు!
ఇటీవల కర్ణాటకలోని రాయచూర్ కి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి పేరిట మోసం చేసిన గ్యాంగుపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.
By: Tupaki Desk | 24 Jun 2025 1:00 PM ISTపెళ్లి కావడం లేదని మదనపడుతున్నారా? ఏదో ఒక సంబంధం కుదిరితే వివాహం చేసుకుని సెటిల్ అయిపోదామని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఎందుకంటే పెళ్లికాని ప్రసాదులే టార్గెట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఓ నకిలీ పెళ్లిళ్ల ముఠా రంగంలోకి దిగింది. ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపిస్తూ నిండా ముంచేస్తుంది. బెజవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ముఠా చేతిలో మోసపోయిన కేసులు ఇప్పటికి రెండు వెలుగుచూశాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముఠా మోసాలకు చాలా మంది బలైపోయినట్లు అనుమానిస్తున్నారు.
ఇటీవల కర్ణాటకలోని రాయచూర్ కి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి పేరిట మోసం చేసిన గ్యాంగుపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. మొత్తం మూడు గ్యాంగులు, దాదాపు 25 మంది దొంగ పెళ్లికూతుళ్లతో ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపిస్తూ దోచుకుంటున్నట్లు చెబుతున్నారు. అద్దె గదుల్లో పెళ్లి చూపులు నిర్వహించి ఎదురుకట్నం భారీగా డిమాండ్ చేసి మూడు ముళ్లు కట్టించుకున్న తర్వాత ముఖం చాటేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
40 ఏళ్లు పైబడిన వివాహం కాని వారిని గుర్తించి పెళ్లి చేస్తామని ఎరవేస్తున్న పెళ్లిళ్ల పేరయ్యలు దొంగ పెళ్లి కూతర్లతో పెళ్లి చూపులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయికి అబ్బాయి నచ్చాడని చెప్పి వివాహం జరిపిస్తున్నారు. ఇలా పెళ్లి చేసుకున్నవారు అప్పటికే పెళ్లి అయి పిల్లలు ఉన్నవారే అంటున్నారు. నకిలీ పెళ్లి తర్వాత వరుడి వెంట వెళ్లడానికి ఇష్టపడకుండా బెజవాడలోనే ఉండిపోతున్నారు. ఇటీవల రాయచూర్ కి చెందిన వ్యక్తికి ఇలానే వివాహం చేశారు. అతడు భార్యను తీసుకుని రాయచూర్ వెళ్లగా, అక్కడికి వెళ్లిన రెండు రోజుల నుంచి ఆ యువతి తిరిగి విజయవాడ వచ్చేస్తానని అల్లరి చేసినట్లు చెబుతున్నారు. దీనిపై సదరు వరుడు భార్యను గట్టిగా నిలదీస్తే అప్పటికే తనకు వివాహమైందని, పిల్లలు కూడా ఉన్నారని చెప్పిందని అంటున్నారు. దీనిపై బాధితుడు విజయవాడలో వివాహం చేయగా, పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన వారిని పోలీసులు విచారిస్తే నకిలీ పెళ్లిళ్ల విషయం వెలుగుచూసింది.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలోని చిట్యాలకు చెందిన యువకుడిని ఈ ముఠా మోసగించిన విషయం బయటపడింది. చిట్యాలకు చెందిన యువకుడికి బాగా ఆస్తి ఉంది. అయితే 45 ఏళ్లు వచ్చినా అతడికి వివాహం అవ్వకపోవడంతో బంధువుల ఇంట్లో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో పెళ్లిళ్ల పేరయ్య పరిచయమయ్యాడు. దీంతో అతడు ఓ మహిళకు ఎదురుకట్నం ఇప్పించి వివాహం జరిపించాడు. పెళ్లి అయిన తర్వాత ఆ యువతి చిట్యాలకు వెళ్లి రెండు రోజులకే తల్లికి అనారోగ్యం పేరుతో విజయవాడ వచ్చేసింది. చిట్యాల నుంచి వెళ్లిన భార్య ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ యువకుడు విజయవాడ వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
ఈ వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. మొత్తం మూడు ముఠాలు విజయవాడ కేంద్రంగా నకిలీ పెళ్లిళ్లు జరిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మూడు గ్యాంగుల్లో దాదాపు 25 నుంచి 30 మంది మహిళలు ఉన్నారని, వీరిలో భర్త నుంచి విడిపోయిన వారు, భర్త చనిపోయిన ఒంటరిగా ఉన్నవారే ఎక్కువ అంటున్నారు.
పెళ్లికాని ప్రసాదులను ఎంపిక చేసుకుని ముఠాలోని మహిళలతో పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఇందుకోసం నగరంలోని పలు చోట్ల అద్దె గదులు వాడుతున్నారు. యువతికి ఎవరూ లేరని, అప్పులు ఉన్నాయని, ఇతర సమస్యలు పేరు చెప్పి ఎదురుకట్నంగా రూ.5 నుంచి రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. పెళ్లి చేసుకున్న యువతికి రూ.30 నుంచి రూ.50 వేలు చేతిలో పెట్టి పెళ్లి అయిన తర్వాత వారం పది రోజులు వరుడు దగ్గర ఉండేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారని పోలీసుల విచారణలో బయటపడింది. అలా పెళ్లి పేరుతో అత్తారింట్లో అడుగుపెట్టే మహిళలు ఆ తర్వాత ఏదో పేరుతో తప్పించుకుని బెజవాడ వచ్చేస్తున్నారు. రాయచూర్ బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా చిట్యాల యువకుడు కూడా ఈ ముఠా చేతిలో మోసపోయినట్లు వెలుగుచూసింది. త్వరలో మరింత మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.