నేను, నా భార్య మాట్లాడుకునేది విన్నారు: ఈటల సంచలన వ్యాఖ్యలు
టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఇంకా ఎందుకు పూర్తి కావడం లేదని భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
By: Tupaki Desk | 24 Jun 2025 3:25 PM ISTటెలిఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఇంకా ఎందుకు పూర్తి కావడం లేదని భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఈ కేసులో సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘నా ఫోన్‌ను అనేకసార్లు ట్యాప్ చేశారు. నేను, నా భార్య మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణలు కూడా విన్నారని తెలిసింది. నా ప్రైవసీని, నా హక్కులను పూర్తిగా ఉల్లంఘించారు. ఇదేనా ప్రజాస్వామ్యం? BRS హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ తన ఇష్టానికి పనిచేసే వారిని ఉన్నతస్థాయిల్లో నియమించుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న వాళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.
మునుగోడు ఉపఎన్నిక, హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఈటల ఆరోపించారు. ‘‘మా పార్టీ నేతల మధ్య సంభాషణను కూడా కాల్ డేటాలో చూపించారు. 2023లో గజ్వేల్ పోటీ సమయంలో దుర్మార్గంగా నన్ను గమనించారు. మేమెవరితో మాట్లాడుతున్నామో తెలుసుకోవడానికి ట్యాపింగ్ చేశారు. ఇలా చేసే వారే ప్రజల్ని ధైర్యంగా ఎదుర్కోలేని బలహీనులు’’ అని ఈటల విమర్శించారు.
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కూడా ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఆయన ఐపీఎస్ అధికారి కాదు. అయినా ఎస్ఐబీ చీఫ్‌గా నియమించారు. ఇది నిబంధనలకు వ్యతిరేకం. ఫోన్లు ట్యాప్ చేయడం రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మంత్రులు, జడ్జిలు, పార్టీ కీలక నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని తెలిసింది. అంతేకాదు, కాళేశ్వరం పై కమిటీ నివేదికను కూడా ఇప్పటివరకు బయటపెట్టలేదు’’ అని అన్నారు.
విచారణ కమిషన్ నివేదికను బయటపెట్టకపోవడంపై కూడా ఈటల ప్రశ్నించారు. ‘‘పోన్ ట్యాపింగ్‌పై విచారణ ప్రారంభించి ఏడాదిన్నర కాలం గడిచింది. అయినా ఇంకా కమిషన్ నివేదిక రాలేదు. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను బహిర్గతం చేయడంలో భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌లు ఎందుకు వెనకడుగు వేస్తున్నాయి? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చకు దారితీసింది. ఈ కేసులో నిజానిజాలు బయటపడే వరకు రాష్ట్ర రాజకీయ వాతావరణం ఉద్విగ్నంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.