Begin typing your search above and press return to search.

టీడీపీ అధికారంలో ఉండి కూడా అక్క‌డ ఇన్‌చార్జ్ క‌రువ‌య్యాడా..?

పార్టీకి దశాబ్దాలుగా సేవలందించిన చాలామంది నాయకులు ఇన్చార్జి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానం మాత్రం అస్సలు ఈ పదవి భర్తీ చేసే ఆలోచనలోనే లేనట్టు తెలుస్తోంది.

By:  Garuda Media   |   13 Aug 2025 10:00 PM IST
టీడీపీ అధికారంలో ఉండి కూడా అక్క‌డ ఇన్‌చార్జ్ క‌రువ‌య్యాడా..?
X

శ్రీకాకుళం జిల్లాలో రాజకీయంగా బాగా ప్రాధాన్యత ఉన్న నియోజకవర్గం ఎచ్చెర్ల. ఒకప్పుడు ఇక్కడి నుంచి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి రాజకీయాలు నడిపేవారు. ఎచ్చెర్ల జనరల్ కావడంతో ఇక్కడి నుంచి కళా వెంకట్రావు రాజకీయం మొదలైంది. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమికి తెలుగుదేశం పార్టీ నేతృత్వం వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 174 నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి ఇన్చార్జీలు ఉన్నా ఎచ్చెర్లలో మాత్రం టిడిపికి ఇన్చార్జి లేకపోవడం విచిత్రం. గత ఎన్నికలలో ఇక్కడ నుంచి బిజెపి అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. యేడాదిన్న‌ర అవుతున్నా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తరఫున తమ గోడు వినే నాథుడే కరువయ్యాడని తెలుగు తమ్ముళ్లు ఆవేదన పడుతున్నారు. పార్టీకి దశాబ్దాలుగా సేవలందించిన చాలామంది నాయకులు ఇన్చార్జి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నా అధిష్టానం మాత్రం అస్సలు ఈ పదవి భర్తీ చేసే ఆలోచనలోనే లేనట్టు తెలుస్తోంది.

మరోవైపు బిజెపి ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర రావు ఇక్కడ పాతుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కళా వెంకట్రావు కుమారుడు రాం మ‌ల్లిక్ నాయుడుతో పాటు మరో ఇద్దరు ముగ్గురు నాయకులు పదవి కోసం పావులు కదుపుతున్నా పార్టీ పెద్దలు మాత్రం అసలు పట్టించుకోవడం లేదంట మరోవైపు ఎచ్చర్ల టిడిపి ఎంత పరిస్థితి ఎదుర్కొంటుంది. గతంలో టిక్కెట్ కోసం కుమ్ములాటలకు దిగిన కళా వెంకట్రావు , విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వర్గాలు రెండు ప్రస్తుతం నియోజకవర్గ టిడిపి క్యాడర్‌కు అందుబాటులో ఉండటం లేదు. కళా వెంకటరావు చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉండడంతో మొత్తం అక్కడ ఫోకస్ పెట్టారు. కలిశెట్టి విజయనగరం ఎంపీ అయ్యాక అయితే ఢిల్లీ లేదంటే విజయనగరంలో ఉండడంతో ఎచ్చెర్ల టిడిపి నేతలు అంతా పనుల కోసం బిజెపి ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సి వస్తుందట.

అయితే ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్థిగా తాము బిజెపి ఎమ్మెల్యే ఈశ్వర రావుని గెలిపిస్తే ఇప్పుడు ఆయన తమను అంతగా పట్టించుకోవడంలేదని.. ఎలాగైనా ఇక్కడ టిడిపికి ఇంచార్జి వస్తే పార్టీ ట్రాక్ లోకి ఎక్కుతుందని లేకపోతే పార్టీ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతుందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. టిడిపిలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు తనకు అనుకూలంగా మలుచుకునే ప్లాన్లో ఉన్నా ఎమ్మెల్యే కళా వెంకటరావు వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎంపీ కలిశెట్టి టీంతో జస్ట్ టచ్ మీ నాట్ అన్నట్టుగా స‌రి పెడుతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఎచ్చర్ల టిడిపిలో ఈ విభేదాలకు చెక్ పెట్టాలి అంటే తక్షణమే ఇన్చార్జి నియమించాలని తెలుగు తమ్ముళ్లు కోరుతున్నారు.