కర్ణాటక సీఎం కుర్చీపై కన్నేసిన ‘డీకే’..
అయితే, తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంగా చెబుతుండగా డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మళ్లీ ఊతమిచ్చాయి.
By: Tupaki Desk | 7 July 2025 6:45 PM ISTఆశపడడంలో తప్పులేదు. ఎందుకంటే కర్ణాటకలో బలమైన బీజేపీని ఓడించి కాంగ్రెస్ ను గద్దెనెక్కించడంలో డీ శివకుమార్ కీలక పాత్ర పోషించారు. కానీ సీనియర్ అయిన సిద్ధరామయ్య కోసం పదవి త్యాగం చేశాడు. అంత పేరు, పలుకుబడి ఉండి డీకే సీఎం పదవికి దూరంగా ఉండడంపై ఆయన అనుయాయులు, కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉన్నాయి. ఈ విషయంలో డీకే కూడా కాస్తా అసంతృప్తిగానే ఉన్నారు. తాజాగా సీఎం సీటుపై డీకే బయటపడ్డాడు.
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి నెలకొన్న ఉత్కంఠ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. "ప్రజలు తనను ముఖ్యమంత్రిగా చూడాలనుకోవడంలో తప్పేమీ లేదు" అని ఆయన వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతుందన్న అభిప్రాయం బలపడుతోంది.
- డీకే మాటల వెనుక మర్మం ఏంటి?
రంభపురి పీఠాధిపతి శ్రీ రాజదేశికేంద్ర శివచార్య స్వామితో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న డీకే శివకుమార్‌కు ఉన్నత పదవి రావాల్సిందని పీఠాధిపతి వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన డీకే "ప్రజలకైనా, కార్యకర్తలకైనా తమ అభీష్టాలు ఉండవచ్చు. తాను సీఎం కావాలని ఆశపడటం తప్పేమీ కాదు" అని అన్నారు. అయితే, వెంటనే తానే కాదు, పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేస్తానని, చివరి నిర్ణయం అధిష్ఠానానిదేనని స్పష్టంగా చెప్పడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు డీకే మనసులో ఉన్న ఆకాంక్షను పరోక్షంగా బయటపెట్టాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
- సిద్ధరామయ్య వర్సెస్ డీకే: అధికార పంపకాలపై సందిగ్ధత?
2023 ఎన్నికల తర్వాత సీఎం పదవిని రెండు భాగాలుగా విభజించి, మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్యకు, తదుపరి రెండున్నరేళ్లు డీకేకు అవకాశం కల్పిస్తారని అప్పట్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, తాజాగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఐదేళ్లూ తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంగా చెబుతుండగా డీకే శివకుమార్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మళ్లీ ఊతమిచ్చాయి. ఇది కాంగ్రెస్ అధిష్ఠానానికి ఒక కొత్త తలనొప్పిగా మారింది.
- కాంగ్రెస్ శిబిరంలో అసంతృప్తి?
డీకే శివకుమార్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, మఠాధిపతులు వంటి వారంతా సీఎం మార్పు అంశాన్ని బలంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ శిబిరంలో అసంతృప్తి వాతావరణం ఉధృతమవుతుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రిని మార్చాలన్న డిమాండ్లు పార్టీలో అంతర్గత విభేదాలను మరింత పెంచుతాయన్న ఆందోళన నెలకొంది.
-అధిష్ఠానం ముందు రాజకీయ లెక్కలు..
కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం సిద్ధరామయ్యను కొనసాగించాలన్న ధోరణిలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి మారితే పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన ఉంది. దీనికితోడు ప్రభుత్వం స్థిరత్వాన్ని కాపాడాలన్నదే అధిష్ఠాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
డీకే శివకుమార్ వ్యాఖ్యలు కేవలం ఉద్దేశపూర్వకంగా వచ్చాయా? లేక ఆయన మదిలో సీఎం పీఠంపై ఉన్న ఆకాంక్షనే పరోక్షంగా వ్యక్తం చేశారా? అన్నది ప్రస్తుతానికి మిలియన్-డాలర్ ప్రశ్న. ఏదేమైనా ఈ వ్యాఖ్యలతో కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మళ్లీ తెరపైకి వచ్చాయనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.