మోడీకి 'ఫ్యామిలీ ప్యాక్' ఎఫెక్ట్... వయా ఇందిరా గాంధీ!
అవును... దేశంలో ఎమర్జెన్సీ విధించి ఇటీవల ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేతలు, మోడీ.. ఇందిరాగాంధీపైనా, కాంగ్రెస్ నేతలపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే
By: Raja Ch | 30 July 2025 9:22 AM ISTదేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ నాటి రోజులను గుర్తుచేసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఇందిరాగాంధీ పైనా, గత కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే! దీన్ని 'సంవిధాన్ హత్య దివస్'గా ప్రజలు గుర్తుంచుకోనున్నారని అన్నారు. ఈ సమయంలో అదే ఇందిరాగాందీ పేరు చెప్పి మోడీని ఇరకాటంలో సోనియా అండ్ కో పెట్టారు!
అవును... దేశంలో ఎమర్జెన్సీ విధించి ఇటీవల ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ నేతలు, మోడీ.. ఇందిరాగాంధీపైనా, కాంగ్రెస్ నేతలపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆపరేషన్ సిందూర్ విషయంలో పార్లమెంట్ లో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మోడీపై విరుచుకుపడగా.. గాజాలో ఇజ్రాయెల్ సైన్యం చేస్తోన్న దాడుల విషయంలో మోడీపై సోనియా గాంధీ ఫైర్ అయ్యారు.
ఈ రెండు సందర్భాల్లోనూ ఇందిరాగాంధీ పేరు ప్రస్థావిస్తూ మోడీని కార్నర్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ పై జరుగుతున్న చర్చ సందర్భంగా... సీజ్ ఫైర్ పై తొలి ప్రకటన చేసిన ట్రంప్ టాపిక్ ఎత్తారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా... "ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో 50% ఉన్నా కూడా.. పార్లమెంటులో లేచి నిలబడి, ట్రంప్ అబద్ధం చెబుతున్నాడు, ఆయన కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించలేదు" అని చెప్పాలని సవాల్ విసిరారు.
మరోవైపు... గాజాలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న మారణహోమంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనం వహించడం సిగ్గుచేటు అంటూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా... పిరికితనంతో మోడీ నైతిక విలువలకు తిలోదకాలిచ్చారని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా నాడు పాలస్తీనా విషయంలో ఇందిరాగాంధీ చొరవను గుర్తు చేశారు!
తాజాగా... "గాజా సంకట్ పర్ మూక్ దర్శక్ మోదీ సర్కార్" అనే శీర్షికతో ఓ ప్రముఖ హిందీ వార్త పత్రికకు సోనియా వ్యాసం రాశారు. ఈ సందర్భంగా... పాలస్తీనా అంశంలో దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న వైఖరిని ప్రధాని స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తం చేయాలని సోనియా గాంధీ సూచించారు. మానవత్వంపై జరుగుతున్న ఈ ఘోరకలిని మోడీ ప్రభుత్వం మౌనంగా చూస్తుండటం సరికాదని అన్నారు.
ఈ నేపథ్యంలోనే... 1974లో ఇందిరా గాంధీ సారథ్యంలోని భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజల ఏకైక, చట్టబద్ధ ప్రతినిధి పాలస్తీనా విమోచన సమితిని గుర్తించిందని ఈ సందర్భంగా ప్రస్తావించిన సోనియా... 1988లో పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశాలలో భారత్ కూడా ఉందని అన్నారు. భారత్ మొదటి నుంచీ ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజల మధ్య శాంతికి మద్దతుదారుగా ఉందన్నారు.
ఈ విధంగా మంగళవారం నాడు మోడీని కాంగ్రెస్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ ఎఫెక్ట్ వయా ఇందిరాగాంధీ తగిలిందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో అటు పార్లమెంటులో రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ పేరు చెప్పి మోడీకి సవాల్ విసరగా... పత్రికకు రాసిన వ్యాసంలో సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. దీంతో... ఈ విషయం పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.