Begin typing your search above and press return to search.

ఫోన్, బైక్, ట్రాక్టర్... దొంగల నుంచి ఎమ్మెల్యేకు వరుస షాకులు!

అవును... రాజస్థాన్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత దీన్‌ దయాల్ బైర్వా.. దౌసా నిజయోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయనను దొంగలు వరుసగా టార్గెట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   8 July 2025 1:52 PM IST
ఫోన్, బైక్, ట్రాక్టర్... దొంగల నుంచి ఎమ్మెల్యేకు వరుస షాకులు!
X

సాధారణంగా ఎమ్మెల్యే ఇల్లు అంటే.. అక్కడ ఎప్పుడూ సందడిగానే ఉంటుంది. నిత్యం వచ్చే వాళ్లు, వెళ్లేవాళ్లతో కాస్త హడావిడిగానే ఉంటుంది. ఇక సెక్యూరిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమందికైతే ప్రభుత్వ భద్రతతో పాటు ప్రైవేటు భద్రతా ఉంటుంది. అలాంటి ఓ ఎమ్మెల్యే ఇంటిని దొంగలు టార్గెట్ చేశారు. నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు దొంగతనం చేసి షాకిచ్చారు!

అవును... రాజస్థాన్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత దీన్‌ దయాల్ బైర్వా.. దౌసా నిజయోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయనను దొంగలు వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా... జూన్ 11న దౌసాలో మాజీ కేంద్ర మంత్రి రాజేశ్ పైలట్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఫోన్ కొట్టేశారు.

అక్కడితో ఆయనకు షాకులు ఆగలేదు. ఫోన్ పోయిన తర్వాత కొన్ని రోజులకు ఆయన ఇంటి నుంచి మోటార్‌ సైకిల్ ఎత్తుకెళ్లిపోయారు. ఇదే క్రమంలో తాజాగా సోమవారం రాత్రి మళ్లీ ఆయన ఇంటి నుంచే ట్రాక్టర్ ట్రాలీ దొంగతనానికి గురైంది. ఇలా వరుసగా చోరీలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఆయన వరుస షాకులతో ఇబ్బంది పడుతున్నారు.

ఇదే సమయంలో... పోలీసులను నిలదీస్తూ, ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇందులో భాగంగా.. ఎమ్మెల్యేగా ఉన్న తనకే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని పోలీసులను నిలదీసిన ఆయన... గతంలో ఎప్పుడూ తనకు ఇలాంటి పరిస్థితి రాలేదని.. కానీ ఇప్పుడు వరుసగా మూడు దొంగతనాలు జరిగాయని తెలిపారు.

అయితే... ఇంట్లో టూ వీలర్ పోయినప్పుడు సీసీ కెమెరా పనిచేయ లేదని.. నిర్మాణ పనుల నిమిత్తం కెమెరాలను తొలగించామని.. తాజాగా రాత్రి ట్రాలీ పోయిందని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన అసెంబ్లీలో ప్రతిపక్షనేత టికారామ్... ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా సురక్షితంగా లేరంటూ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

మరోవైపు ఈ ఘటనలపై దౌసా ఎస్పీ సాగర్ స్పందించారు. ఈ సందర్భంగా... ట్రాలీ దొంగతనం విషయంలో తమకు ఇంతవరకు ఫిర్యాదు అందలేదనే.. మొబైల్‌ ఫోన్ చోరీ కేసులో మాత్రం ఎఫ్‌.ఐ.ఆర్ నమోదైందని తెలిపారు.