Begin typing your search above and press return to search.

పీహెచ్‌డీ వద్దు.. ఫుడ్ స్టాల్ ముద్దు.. ఈ యువకుడి ధైర్యం మెచ్చుకోవచ్చు

నేటి తరం యువత ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. వారికి నచ్చిన పని ఎంత కష్టమైనా చేయడానికి వెనుకాడడం లేదు.

By:  Tupaki Desk   |   28 April 2025 6:30 PM
పీహెచ్‌డీ వద్దు.. ఫుడ్ స్టాల్ ముద్దు.. ఈ యువకుడి ధైర్యం మెచ్చుకోవచ్చు
X

నేటి యువత తమ అభిరుచులకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకుంటున్నారు. ప్రస్తుతం సమాజం కట్టుబాట్లను, సంప్రదాయాలను పక్కనబెట్టి తమకు నచ్చిన రంగంలో రాణిస్తున్నారు. చదువుకుంటే మంచి ఉద్యోగం చేయాలన్న ఆలోచనను వీరు దాటి పోయారు. తాజాగా ఒక చైనా యువకుడు చేసిన పని ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అతడు ఏకంగా పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌ను వదులుకుని వీధిలో ఫుడ్ స్టాల్ పెట్టుకున్నాడు. అతడి కథేంటో ఈ కథనంలో చూద్దాం.

నేటి తరం యువత ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. వారికి నచ్చిన పని ఎంత కష్టమైనా చేయడానికి వెనుకాడడం లేదు. కానీ ఇష్టం లేని పని ఎంత సులువైనా దానిని పట్టించుకోరు. దీనికి అద్దం పట్టే విధంగా ఓ చైనా యువకుడి ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతగాడి నిర్ణయం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఏకంగా స్కాలర్‌షిప్‌తో పీహెచ్‌డీ చేసే అవకాశం వచ్చినా దాన్ని కాదనుకుని వీధిలో ఫుడ్ స్టాల్ పెట్టుకున్నాడు ఆ యువకుడు.

ఫే యూ (24) అనే యువకుడు పేద కుటుంబానికి చెందిన వాడు. కానీ తన అసాధారణ ప్రతిభతో చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. చైనాలోని ప్రతిష్ఠాత్మక సిచువాన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, మరో ప్రముఖ యూనివర్సిటీలో పీజీ చేసే అవకాశం కూడా తనకు లభించింది. అయితే, పీజీ సమయంలో తన హెచ్ఓడీ దుష్ప్రవర్తన కారణంగా ఫే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి. దీంతో చేసేది లేక చదువును మధ్యలోనే ఆపేశాడు.

అయినప్పటికీ ఫే తన ప్రయత్నాలను ఆపలేదు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతడి అదృష్టం బాగుండడంతో ఒక ప్రముఖ యూనివర్సిటీ స్కాలర్‌షిప్‌తో సహా సీటును కూడా లభించింది. కానీ అమెరికా, చైనా మధ్య నెలకొన్ని రాజకీయ ఉద్రిక్తతలు అతడి భవిష్యత్ ప్రణాళికలను పూర్తిగా మార్చేశాయి. అమెరికా ప్రభుత్వం యూనివర్సిటీ నిధులకు కోత విధించడంతో ఫే స్కాలర్‌షిప్ రద్దయింది.

అయిన ఫే మాత్రం నిరాశ చెందలేదు. తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు కానీ వెనకడుగు మాత్రం వేయలేదు. కొత్త ఉత్సాహంతో తన కార్యక్షేత్రంలోకి దిగాడు. తాను చదువుకున్న సిచువాన్ యూనివర్సిటీ ముందే ఒక చిన్న ఫుడ్ స్టాల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం అతడు రోజుకు దాదాపు రూ. 11 వేల వరకు సంపాదిస్తున్నాడు.