Begin typing your search above and press return to search.

రాజమౌళి 'ఈగ' తరహాలో చైనా 'దోమ' రోబో.. ఇది అంతకు మించి!

అవును... చైనా నిఘా సంస్థలకు అతి పెద్ద ప్రోత్సాహకంగా అన్నట్లుగా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ (ఎన్.యూ.డీ.టీ) ఒక చిన్న "దోమ లాంటి" మైక్రోడ్రోన్‌ ను అభివృద్ధి చేసింది.

By:  Tupaki Desk   |   24 Jun 2025 3:00 AM IST
రాజమౌళి ఈగ తరహాలో చైనా దోమ రోబో..  ఇది అంతకు మించి!
X

రాజమౌళి సినిమాలో ‘ఈగ’ ఎంత హడావిడి చేస్తుందనేది తెలిసిన విషయమే. తాను ప్రేమించిన అమ్మాయిని ఇబ్బదిపెడుతున్న విలన్ ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేస్తుంది. ఈ నేపథ్యంలో అంతకు మించి, ఊహకు అందని రీతిలో చైనా ఓ అద్భుతాన్ని సృష్టించింది! ఇందులో భాగంగా.. దోమ లాంటి ఓ మైక్రోడ్రోన్ ను అభివృద్ధి చేసింది.

అవును... చైనా నిఘా సంస్థలకు అతి పెద్ద ప్రోత్సాహకంగా అన్నట్లుగా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ (ఎన్.యూ.డీ.టీ) ఒక చిన్న "దోమ లాంటి" మైక్రోడ్రోన్‌ ను అభివృద్ధి చేసింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయడానికి అంకితమైన ఛానెల్ సీసీటీవీ-7 ఈ విషయాలను వెల్లడించింది.

ఆ ఛానెల్ నివేదిక ప్రకారం... ఈ మానవరహిత వైమానిక వాహనం కాస్త దూరం నుంచి చూసినా కంటికి కనిపించదు. దీంతో.. రహస్య సైనిక కార్యకలాపాలలో ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మైక్రోడ్రోన్ రెండు రెక్కలు, మూడు వెంట్రుకలంత కాళ్ళతో ఉంటుంది. ఇది అద్భుతమైన అప్ డేట్ అని కొనియాడుతున్నారు. దీనిని స్మార్ట్‌ ఫోన్‌ తో కంట్రోల్ చేస్తున్నారు.

వాస్తవానికి... మిలిటరీతో సహా వివిధ రంగాలలో మైక్రోడ్రోన్‌ లు ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారుతున్నాయి. వీటిద్వరా... మానవులకు కష్టతరమైన లేదా ప్రమాదకరమైన భూభాగాలను లేదా ప్రాంతాలను యాక్సెస్ చేయడానికి వీలు కలుగుతుంది. దానికున్న పెద్ద అడ్వాంటేజ్ దాని సైజు... దీని వల్ల దాన్ని గుర్తించడం అవతలివారికి ఆల్ మోస్ట్ అసాధ్యం అని అంటున్నారు.

ఇలా రక్షణ రంగానికి చెందిన పనులతో పాటు ఇటువంటి డ్రోన్లు విపత్తు సమయంలో మానవతా సహాయ కార్యకలాపాలలో చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే... అవి కూలిపోయిన భవనాలలో చిక్కుకున్న బాధితుల కోసం వెతుకగలవని.. సహాయకులను నావిగేట్ చేయగలవని స్పష్టం చేస్తున్నారు.