చైనాను వెంటాడిన అగ్గి.. రెస్టారెంట్ లో మంటలు.. 22 ప్రాణాలు బుగ్గి
ఇక్కడి లియోనింగ్ ప్రావిన్స్ లియోయాంగ్ నగరంలో ఉన్న ఓ రెస్టారంట్ లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించి 22 మంది బుగ్గి అయ్యారు.
By: Tupaki Desk | 29 April 2025 9:00 PM ISTచైనాలో ఏం జరిగినా పెద్ద వింతే అంటారు.. విశ్వామిత్రుడి లాగా అసలుకు నకిలీని తయారుచేయడంలో డ్రాగన్ ది అందెవేసిన చేయి. అంతేకాదు.. తమ సొంత సామర్థ్యంతో ఎదగడంలోనూ చైనాకు ఎవరూ సాటిరారు.
150 కోట్లకు పైగా ఉన్న జనాభాను అత్యంత సమర్థంగా వాడుకున్న ఘనత చైనాదే. కేవలం 35 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన గొప్ప కూడా చైనాకే సొంతం.
ఇక కొన్ని ప్రాజెక్టుల విషయంలో చైనాను ఢీకొట్టే దేశమే లేదు. అయితే, కొన్నాళ్లుగా ఆ దేశంలో ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఐదేళ్ల కిందట చైనా నుంచే వ్యాప్తి మొదలైందని చెప్పుకొనే కొవిడ్ ఎంతటి విలయం రేపిందో అందరూ చూశారు. రెండేళ్ల కిందట చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పై కుట్ర జరిగిందని, ఆయనను పదవి నుంచి దింపేశారని కథనాలు వచ్చాయి. ఇవేవీ నిజం కాలేదు.
తాజాగా నెలలో రెండోసారి భారీ దుర్ఘటన చైనాలో చోటుచేసుకుంది. ఇక్కడి లియోనింగ్ ప్రావిన్స్ లియోయాంగ్ నగరంలో ఉన్న ఓ రెస్టారంట్ లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించి 22 మంది బుగ్గి అయ్యారు.
అందరూ ఆదమరిచి ఉండగా..
మధ్యాహ్నం సమయంలో అందరూ ఆదమరిచి ఉండగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 12.25గంటల సమయంలో రెస్టారంట్ లో మంటలు చెలరేగి 22మంది చనిపోయారు. ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
ఏప్రిల్ 9న ఉత్తర చైనా హెబీ ప్రావిన్స్ లోని నర్సింగ్ హోంలో జరిగిన అగ్నిప్రమాదంలో 20మంది వృద్ధులు ఆహుతయ్యారు. సరిగ్గా 20 రోజుల వ్యవధిలో మరో భారీ ప్రమాదం అది కూడా అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.