మైకు దొరికితే వదలరేంది బాబు.. ఎందుకీ శిక్ష?
సాధారణంగా ఏకబిగిన 40 నిమిషాల పాటు వినగలుగుతారు. ఆ తర్వాత నుంచి ఎదుటోళ్లు ఎవరైనా వారు చెప్పే మాటల్ని ముందు తీసుకున్న శ్రద్ధగా బ్రెయిన్ తీసుకోలేదు.
By: Tupaki Desk | 24 Jun 2025 9:58 AM ISTప్రతి అధినేతకు మంచి అలవాట్లు మాదిరే కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మినహాయింపు కాదు. ఆయన తన మాటలతో సహనానికి పరీక్ష పెడతారు. మైకు దొరికితే.. వదలిపెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. దాని సంగతి చూసే వరకు వదలరు. ఎదుటోళ్లు తన మాటల్ని వింటున్నారా? లేదా? అన్నది ఆయనకు అప్రస్తుతం. తాను చెప్పాలనుకున్నది చెప్పుకుంటూ పోతారే తప్పించి.. తన మాటల్ని ఎక్కించుకుంటున్నారా? లేదా? అన్నది ఆయనకు పట్టదు. మైకు మీద నియంత్రణ చంద్రబాబుకు రావాలని.. దాన్ని చూడాలని తపించేటోళ్లకు కొదవ ఉండదు. కానీ.. ఆయన మాత్రం ఆ అలవాటును మార్చుకోరు. తనలో మార్పు కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న వారి కోరికను మాత్రం ఆయన తీర్చరు.
తాజాగా కూటమి సర్కారు ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో సోమవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో సుపరిపాలనలో ‘తొలి అడుగు’ పేరుతో కూటమిలో భాగస్వామి పక్షాలైన తెలుగుదేశం.. జనసేన.. బీజేపీతో కూడిన నేతలు.. అధికారులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఏకంగా 1.40 గంటల పాటు ప్రత్యేక ఇవ్వటం గమనార్హం.
సాధారణంగా ఏకబిగిన 40 నిమిషాల పాటు వినగలుగుతారు. ఆ తర్వాత నుంచి ఎదుటోళ్లు ఎవరైనా వారు చెప్పే మాటల్ని ముందు తీసుకున్న శ్రద్ధగా బ్రెయిన్ తీసుకోలేదు. కాస్తంత విరామం ఇచ్చి మళ్లీ మొదలు పెడితే బాగుంటుంది. ఈ కారణంగానే ఏదైనా సెమినార్ జరిగినప్పుడు గంటకో బ్రేక్ ఇస్తారు. కానీ.. చంద్రబాబు మాత్రం అవేమీ పట్టవు. తాజాగా ఆయన చేసిన ప్రసంగమే దీనికి నిదర్శనం. గులాబీ బాస్ కేసీఆర్ మాదిరి చంద్రబాబు మంచి మాటకారి ఏ మాత్రం కాదు. ఆయన ప్రసంగం స్కూల్లో సైన్స్ మాష్టారు చెప్పే డ్రై సబ్జెక్టు మాదిరి ఉంటుంది.
దశాబ్దాల తరబడి తెలుగు రాజకీయాల్లో కీలకభూమిక పోషించిన చంద్రబాబు తన ప్రసంగాలతో సహనానికి పరీక్ష పెడతారు. మైకు చేతికి వచ్చిన క్షణం నుంచి ఆయన తన గురించి తాను మర్చిపోతారు. తాను చెప్పే మాటలతో విన్నోళ్లంతా రాత్రికి రాత్రి మారిపోవాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఆయన ఆశించినట్లు తాను చెప్పే మాటల్ని బుర్రకు ఎక్కించుకోవటం తర్వాత.. వాటిని వినలేక.. అలా అని బయటకు చెప్పలేక.. విన్నట్లుగా నటిస్తారన్న విషయాన్ని ఆయనకు ఎవరు చెప్పాలి?
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న అధినేత.. అదే పనిగా గంటల తరబడి మాట్లాడే కన్నా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెబితే సరిపోతుంది. అందుకు భిన్నంగా ఎంతో చెప్పాలన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది. ఇలాంటి తీరును మార్చుకోవాలని ఆయనకు చాలా సన్నిహితంగా ఉండే వారు ఇప్పటికే చెప్పి.. చెప్పి అలిసిపోయారే తప్పించి చంద్రబాబు మారింది లేదు.
ఇలా తన సుదీర్ఘ ప్రసంగాలతో ఇబ్బంది పెట్టే చంద్రబాబు.. తన మాటతో స్ఫూర్తి పొందటం తర్వాత..సుత్తి కొట్టినట్లుగా ఫీల్ అవుతారన్న విషయాన్ని గ్రహిస్తే మంచిది. లేదంటే.. సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు విలువైన సమయం అనవసరమైన ప్రసంగాలకు వేస్టు కాక మానదు. అందుకు బదులుగా.. ఏదైనా శాఖ మీద సంక్షిప్తంగా రివ్యూ పెడితే..ఆయన కొరుకునే డెవలప్ మెంట్ దిశగా అడుగులు పడే వీలుంటుంది.