బాబు గురించి జగన్ ఇలా పవన్ అలా !
కేవలం నాలుగున్నర దశాబ్దాల వయసులోనే చంద్రబాబు దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీకి సీఎం గా బాధ్యతలు 1995లో చేపట్టారు.
By: Satya P | 13 Aug 2025 7:00 PM ISTఏపీ ముఖ్యమంత్రిగా నాలుగవ సారి ప్రమాణం చేసిన చంద్రబాబుది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. మరో మూడేళ్ళలో ఆయన రాజకీయ జీవితం అర్ధశతాబ్దం దాటుతుంది. ఎర్లీ సెవెంటీస్ నుంచి విద్యార్ధి రాజకీయాల ద్వారా ఎంట్రీ ఇచ్చిన బాబు ఎంతో మంది సీనియర్లతో కలసి పనిచేశారు. చెన్నారెడ్డి మెచ్చిన నేతగా ఉన్నారు. ఆ తరువాత అంజయ్య, భవనం వెంకటరామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేశారు. అలాగే తెలుగుదేశంలో చేరి ఎన్టీఆర్ మంత్రివర్గంలో రెవిన్యూ ఆర్థిక శాఖలు చేపట్టారు.
చిన్న వయసులో పెద్ద పదవి :
కేవలం నాలుగున్నర దశాబ్దాల వయసులోనే చంద్రబాబు దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న ఉమ్మడి ఏపీకి సీఎం గా బాధ్యతలు 1995లో చేపట్టారు. అది లగాయితూ ఏకంగా తొమ్మిదిన్నరేళ్ళ పాటు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక విభజన ఏపీలో కూడా 2014 నుంచి 2019 దాకా ఒకసారి, 2024లో మరోసారి గెలిచి ప్రస్తుతం ఇంకోసారి సీఎం గా బాబు ఉన్నారు ఇక చూస్తే బాబు వయసు ఇపుడు ఏడున్నర పదులు నిండి 76వ పడిలో ఉన్నారు.
ఆఖరు ఎన్నికలేనా :
ఇక వచ్చేసారి ఎన్నికలు 2029లో జరుగుతాయి. ఆ ఎన్నికల నాటికి చంద్రబాబు వయసు దాదాపుగా 80 ఏళ్ళ వరకూ ఉంటుంది. మరి ఆ ఏజ్ లో ఆయన మరోసారి సీఎం అభ్యర్ధిగా ఉంటారా ఉండరా అన్నది కూటమి పార్టీలు నిర్ణయించుకోవాల్సిన విషయం. అయితే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మాత్రం చంద్రబాబుకు 2024 ఎన్నికలే ఆఖరు ఎన్నికలు అని అంటున్నారు. చంద్రబాబుకు ఈసారి వచ్చిన అవకాశాన్ని మంచి కోసం ఉపయోగించాలని సూచిస్తున్నారు. మార్పు తెచ్చుకో బాబూ అని కూడా విసురులు విసురుతున్నారు.
పవన్ మాటల్లో చూస్తే :
అయితే జగన్ చంద్రబాబు ఏజ్ ని చూస్తూ ఆయన రాజకీయంగా ఇక ముందు రోజులలో పెద్దగా క్రియాశీలకంగా ఉండరని భావిస్తున్నారులా ఉంది. అయితే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబులో వయసుని చూడడం లేదు, ఆయన సత్తాను చూస్తున్నారు అని అంటున్నారు. బాబు సమర్ధుడు అయిన పరిపాలకుడని అందువల్ల ఆయన మరో పదిహేనేళ్ళ పాటు ఏపీలో కూటమి ప్రభుత్వానికి సారధ్యం వహించాలని పదే పదే అనేక బహిరంగ సభలలోనే పవన్ ఇప్పటికే చెప్పి ఉన్నారు. అంటే బాబుకి ఏజ్ అన్నది ఒక టెక్నికల్ ఇష్యూ మాత్రమే అన్నది పవన్ భావన అని అంటున్నారు.
రియాలిటీ ఏంటి :
అయితే బాబులో ఎంత స్టామినా ఉన్నా రాజకీయాలు అన్నవి నిత్యం ఒత్తిళ్ళతో కూడుకున్నవి ఇక బాబు చూడని ముఖ్యమంత్రి పదవి కాదు. ఆయన 2029లో కూటమి సారధ్యం వహించడం ఎటూ ఖాయం. అయితే ఆ తర్వాత తిరిగి కూటమి పవర్ లోకి వస్తే బాబు సీఎం గా ఉంటారా అన్నదే ఒక చర్చగా ఉంది. లోకేష్ బాబు వారసుడిగా ఇప్పటికే రెడీగా ఉన్నారు. ఆయనను సీఎం గా చేయాలని యువతరం పార్టీలో గట్టిగా కోరుతోంది. ప్రస్తుతం 42 ఏళ్ళ వయసు ఉన్న లోకేష్ మరో నాలుగేళ్ళకు 46 ఏళ్ళ వారు అవుతారు. సరిగ్గా ఆ వయసులోనే చంద్రబాబు కూడా సీఎం అయ్యారు. దాంతో లోకేష్ రూపంలో బాబుకు అయితే ఎంతో కొంత ఒత్తిడి ఉండొచ్చు అన్న ప్రచారం కూడా ఉంది.
ఇంతకీ ఎవరిది కరెక్ట్ :
ఏపీ ఫ్యూచర్ పాలిటిక్స్ ని సరిగ్గా అంచనా ఎవరు వేస్తున్నారు అన్న చర్చ అయితే ఉంది. జగన్ వరకూ తీసుకుంటే బాబు పొలిటికల్ ఇన్నింగ్స్ దాదాపుగా అయిపోయాయనే గట్టిగా నమ్ముతున్నారు. బాబు బలమైన ప్రత్యర్థి గా ఆయన బయటకు చెప్పకపోయినా లోలోపల అయినా అంగీకరిస్తారు అంటారు. బాబు కనుక తప్పుకుంటే ఏపీ రాజకీయాల్లో జగన్ కి తిరుగులేదని వైసీపీ వర్గాలు కూడా భావిస్తాయని చెబుతారు. ఇక లోకేష్ పవన్ ఈ ఇద్దరూ కూటమిలో కాబోయే సీఎంలుగా ప్రచారంలో ఉన్న వారు.
అయితే లోకేష్ కే ఎక్కువ చాన్స్ వచ్చే ఎన్నికల్లో కూటమి గెలిస్తే ఉంటుంది అని అంటున్నారు. అదే జరిగితే అపుడు జనసేన పవన్ పాలిటిక్స్ ఎలా ఉంటుందో తెలియదు. ఇక వైసీపీకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే 2029లో ఆరు నూరు అయినా గెలుస్తామని నమ్మకం ఉంది. కూటమిలో లుకలుకలే తమకు శ్రీరామ రక్ష అన్న ఆలోచన కూడా ఉంది అంటారు. అందుకే బాబు మీదనే గురి పెట్టి మరీ విమర్శలు సంధిస్తున్నారు అని అంటారు. చూడాలి మరి ఈ అంచనాలు ప్రచారాలు ఏ మేరకు నిజం అవుతాయో.