తన మాటలతో ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎక్కడికో తీసుకెళ్లిన చంద్రబాబు!
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్థ్యాల్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ పొగిడిన వైనం ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 24 Jun 2025 12:00 PM ISTఎవరు అవునన్నా కాదన్నా.. ప్రభుత్వం పని చేసేందుకు కీలకం ప్రభుత్వ ఉద్యోగులు. వారందరి కమిట్ మెంట్ తోనే ఏదైనా సాధ్యం. గుప్పెడు మంది ఉండే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు కోరుకున్నట్లగా పాలిస్తే సరి.. ప్రభుత్వ ఉద్యోగులను లైట్ తీసుకున్నా ఫర్లేదనుకున్న ఏ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి వచ్చింది లేదు. ప్రభుత్వ ఉద్యోగుల మనసుల్ని దోచుకున్న ఏ ప్రభుత్వానికి ఢోకా లేని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు వేరుగా ఉంటుంది.
మాట వినని విద్యార్థుల విషయంలో కఠినంగా వ్యవహరించే పాతకాలం స్కూల్ మాష్టారి మాదిరి బెత్తం పట్టుకొని దారికి తెస్తామనుకుంటే అది పొరపాటే అవుతుంది.ఈ విషయాన్ని ఎంతో ఆలస్యంగా గుర్తించారు చంద్రబాబు. ప్రభుత్వ ఉద్యోగుల్ని పనోళ్ల మాదిరి కాకుండా.. విలువైన మానవవనరులుగా చూడాలన్న విషయాన్ని ఈ మధ్యన కానీ ఆయనకు అర్థమైనందని చెప్పాలి. గతంతో పోలిస్తే వారిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యల్లో మార్పు కొట్టొచ్చినట్లుడా కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల శక్తి సామర్థ్యాల్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి మరీ పొగిడిన వైనం ఆసక్తికరంగా మారింది.
కూటమి సర్కారు తన పాలనలో మొదటి సంవత్సరాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వేళ.. తొలి అడుగు పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ ఉద్యోగుల్ని.. వారి పని తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. గతంలో ఇలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు హితబోధ.. హెచ్చరికలు చేసేవారు. అందుకు భిన్నంగా ఆయన పొగడ్తలతో ముంచెత్తారు. ఇంతకూ చంద్రబాబు ఏమన్నారు? అన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చదివితే..
‘‘సీఎం స్వర్ణాంధ్ర 2047 గురించి చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు. అన్నీ సాధ్యమా? అన్న అనుమానం మీలో చాలామందికి ఉండొచ్చు. నేను చెప్పింది జరగటం సాధ్యమే. ఇటీవల విశాఖలో కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవమే ఇందుకు నిదర్శనం. పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో చేస్తే బాగుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సూచనప్రాయంగా చెప్పినప్పుడు నేను సరేనని చెప్పా’’ అంటూ ఇటీవల జరిగిన అంశాన్ని చెప్పుకొచ్చారు.
ప్రధాని తనతో చెప్పిన విషయాన్ని విశాఖపట్నం కలెక్టర్ తో చెబితే.. ఆయన 200-300 మందిని సమీకరిస్తే సరిపోతుందా? అని అడిగారంటూ.. ‘‘నేను నవ్వి.. సూరత్ లో 1.47 లక్షలతో చేసి రికార్డు క్రియేట్ చేశారు. మనం 5 లక్షల మందితో చేద్దామని టార్గెట్ పెట్టాను చాలామంది అది సాధ్యం కాదన్నారు. కానీ.. 30 రోజుల్లో 30 ఈవెంట్స్ చేయటమే కాదు.. ఆ రోజున 3 లక్షల మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేవాం. ఏదైనా మెగాస్కేల్ లో ఆలోచించి సాధ్యం చేస్తేనే మనకు తృప్తి’’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు రావటంతో ప్రభుత్వ ఉద్యోగులు సంతోషానికి గురయ్యారు. ఇంతకు ఆయన ఏమన్నారంటే.. ‘‘ఏ రాష్ట్రానికైనా ఒక కార్యక్రమం చేయమని చెబితే చాలా టెన్షన్ ఫీల్ అవుతారు. కానీ.. మీ వాళ్లు చాలా నవ్వుతూ.. ఏం చెప్పినా చకచకా చేసేస్తున్నారని ప్రధాని కార్యాలయం అధికారులు మిమ్మల్ని ప్రశంసించారు. మీరు హనుమంతుడి లాంటి వారు. మీరు ఏమైనా చేయగలరు. మీ శక్తి మీకు తెలియదు. నాకు తెలుసు’’ అంటూ విద్యార్థుల్ని తన మాటలతో మోటివేట్ చేసే మంచి టీచర్ మాదిరి సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తాయని మాత్రం చెప్పక తప్పదు.