జిల్లాల పునర్విభజనపై కీలక అప్డేట్.. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఇవేనా?
రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.
By: Tupaki Political Desk | 28 Oct 2025 1:34 PM ISTరాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 13 జిల్లాలను పునర్విభజించి 26 జిల్లాలుగా చేశారు. అయితే ఈ విభజన అశాస్త్రీయంగా ఉందని ఫిర్యాదులు రావడంతో ప్రజల అవసరాలు, పాలనా సౌలభ్యమే ప్రధాన అజెండాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏడుగురు మంత్రులతో ఉప సంఘం వేసింది. ఈ మంత్రుల బృందం ప్రజల నుంచి సేకరించిన సమాచారం, ఫిర్యాదులు, అభ్యంతరాలపై మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షించారు.
కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు అనగాని, నారాయణ, నాదెండ్ల, సత్యకుమార్, అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డితోపాటు సీఎస్ విజయానంద్ తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని, ఇది సరిదిద్దాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు, పరిపాలనలోనూ సమస్యలు తలెత్తుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు తెలిపారు.
ప్రజల సూచనలు, వారి సౌలభ్యం కోసం కొత్త జిల్లాలతోపాటు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు చేయాల్సివుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా జిల్లా కేంద్రాల మార్పు, జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపైనా చర్చించారు. ఈ విషయమై పలుమార్లు సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల హామీ కావడంతో ఈ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
వైసీపీ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పాటుచేసినా, ఇప్పటివరకు ఎక్కడా సొంతంగా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించలేదని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికగా జిల్లాలు విభజించడం వల్ల ప్రజలు తమ జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన సమయాల్లో దూరభారంగా ఫీల్ అవుతున్నారు. ఈ క్రమంలో జిల్లాల పునర్విభజనకు ప్రభుత్వం సమాయుత్తం అవడంతో చాలా చోట్ల నుంచి జిల్లా పరిధిని మార్చాలని ప్రతిపాదనలు వచ్చాయి.
శ్రీకాకుళం జిల్లాను పునర్విభజించి పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ ను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా గతంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న రాజాం నియోజకవర్గం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. దీన్ని మళ్లీ విడదీసి శ్రీకాకుళం జిల్లాలో కలపాలని ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు విజయనగరం జిల్లాలో ఉన్న ఎస్.కోట నియోజకవర్గాన్ని విశాఖలో కలపాలని ప్రతిపాదన ఉంది. కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రస్తుతం ఉన్న జిల్లాల నుంచి మార్చాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం నరసాపురంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ ఒకటుంది.
కృష్ణా జిల్లాలో ఉన్న పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాలో కలపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలు విజయవాడ నగరంలో అంతర్భాగంగా ఉంటాయి. వీటిని దూరంగా ఉండే మచిలీపట్నం కేంద్రంగా ఉండే కృష్ణా జిల్లాలో కలపడం వల్ల పాలనపరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక విజయవాడ, గుంటూరులోని కొన్ని ప్రాంతాలను కలిపి అమరావతి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
అదేవిధంగా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రభుత్వం చర్చిస్తోంది. ఈ కొత్త జిల్లాలో రాయలసీమలోని కొంత ప్రాంతంతోపాటు ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాలను విలీనం చేసే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో రెవెన్యూ డివిజన్ల పునర్విభజన జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు.
