జగన్ కాదు కదా...దేవుడు కూడా...బాబు ప్లాన్ అదుర్స్ !
ఇక అమరావతి రాజధాని విషయంలో ఇప్పటికీ అనేకమందికి భయ సందేహాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 29 April 2025 11:00 PM ISTటీడీపీ నేత చంద్రబాబు బుర్ర నుండే ఎన్నో ఆలోచనలూ వ్యూహాలే ఉంటాయి. ఆయన ఎపుడు ఏ వ్యూహం అమలు చేస్తే సక్సెస్ అవుతాయో చూసి మరీ గురి పెడుతూంటారు. ఇక గతంలో చేసిన తప్పులను పొరపాట్లను సరిదిద్దుకోవడంలో బాబు ఏ మాత్రం సందేహించరు. పట్టింపులు పెట్టుకోరు. ఆయనే చెప్పినట్లుగా సవాళ్ళూ సమస్యల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు.
ఇపుడు కూదా అదే చేస్తున్నారు చంద్రబాబు. 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్న చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో చాలా ఆలోచించారు. భారీ కాన్వాస్ మీద స్కెచ్ లు గీసి అనేక దేశాల నుంచి డిజైన్లు అంటూ చాలా కాల హరణం చేశారు. ఆనాడు ఆయన దృష్టి అంతా అమరావతి రాజధానిని అద్భుతంగా కడదాం, తానే కదా మళ్ళీ అధికారంలోకి వచ్చేది అన్నట్లుగా ఉండేది.
పైగా జగన్ కి జనాలు చాన్స్ ఇవ్వరని భావించారు కూడా. అది తప్పు అన్నట్లుగా జగన్ 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. ఇది బాబు రాజకీయంగా ఊహించని ఉపద్రవం అయితే జగన్ అమరావతి రాజధానిని టార్గెట్ చేస్తారని కలలో కూడా ఊహించకపోవడం మరో ఉపద్రవం గా మారింది. జగన్ మూడు రాజధానులు అంటూ అమరావతిని పక్కన పెట్టేసారు. అయితే నాలుగేళ్ళ పాటు ఎలాగోలా అమరావతి రాజధానిని వైసీపీ బారి నుంచి కాపాడుకున్న చంద్రబాబు పొత్తులతో ఎత్తులతో బంపర్ విక్టరీ కొట్టి 2024లో అధికారంలోకి వచ్చారు.
ఇక వచ్చిన వెంటనే ఆయన టాప్ ప్రయారిటీగా అమరావతి రాజధానిని పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రాజధానిని ఈ టెర్మ్ లోనే ఒక రూపునకు తేవాలని బాబు బలంగా డిసైడ్ అయ్యారు. గత పది నెలలలో అమరావతి రాజధాని పునర్ నిర్మాణ పనుల కోసం బాబు వేసిన అడుగులు ఆయన గట్టి సంకల్పం ఏమిటో చాటి చెబుతాయి.
మరో వైపు చూస్తే కేంద్రం సహకారం అందుకోవడం, దండిగా ఆర్ధిక వనరులను సమకూర్చుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు భారీ ప్రాజెక్టులు అప్పగించడం రైల్, ఎయిర్ పోర్ట్ రోడ్డు కనెక్టివిటీని పెంచడం ద్వారా అమరావతిని కేవలం మూడేళ్ళ వ్యవధిలోనే ఒక కీలకమైన స్థితికి తీసుకుని రావాలన్నది బాబు మాస్టర్ ప్లాన్.
ఇక అమరావతి రాజధాని విషయంలో ఇప్పటికీ అనేకమందికి భయ సందేహాలు ఉన్నాయి. ఈ టెర్మ్ లో ఒక దశకు అమరావతి రాజధాని పనులు చేరుకున్నా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందా లేక వేరే విధంగా మారుతుందా అన్నది చాలా మందిలో కలిగే ఆలోచన.
ఇక వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతులలో చూస్తే అనేక డౌట్లు అలాగే ఉన్నాయి. దాంతో వారి భయ సందేహాలను తీర్చేందుకు బాబు అద్భుతమైన ప్లాన్ వేశారు అమరావతిని ఏపీకి శాశ్వత రాజధాని చేయడానికి ఆయన చూస్తున్నారు.
ఏపీకి రాజధానిగా అమరావతి పేరుని కేంద్రం గెజిట్ లో ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నారు రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఏపీకి అమరావతి ఏకైక రాజధానిగా ప్రతిపాదిస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తారు. దానికి కేంద్రానికి పంపిస్తారు. కేంద్రం పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం తయారు చేసి అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా గుర్తించి ఆమోదిస్తుంది. ఆ మీదట రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది.
ఇది కనుక జరిగితే జగన్ కాదు కదా ఆ దేవుడు దిగి వచ్చినా అమరావతి రాజధాని విషయంలో అణువు కూడా కదల్చ లేరని అంటున్నారు. మరి గతంలోనే బాబు ఇలా చేసి ఉండవచ్చు కదా అంటే 2014 నుంచి 2024 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ పేరుని విభజన చట్టంలో ఉంచారు. ఆ చట్టంలో ఒక పేరు ఉండగా మళ్ళీ కొత్త చట్టం చేయడానికి వీలు పడదు. ఇపుడు ఎటూ బాబు అధికారంలోకి వచ్చారు పైగా పదేళ్ళ కాలం ముగిసింది. కాబట్టే అమరావతి రాజధాని విషయంలో కట్టుదిట్టమైన చర్యలకు టీడీపీ ప్రభుత్వం సిద్ధపడుతోంది.
దాంతో కేవలం భూములు ఇచ్చిన రైతులే కాకుండా అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు కూడా శాశ్వత భరోసా లభిస్తుంది అని అంటున్నారు ఇది అమరావతి వికాసానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ మళ్ళీ వచ్చినా అమరావతిని ఏమీ చేయలేరు అని అంటున్నారు.