పవన్ కళ్యాణ్‌పై ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి 140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు.
By: Tupaki Desk | 29 April 2025 8:58 PM ISTఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన 'పాక్ పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లండి' అనే వ్యాఖ్యలపై ఆయన ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదివి 140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. ప్రజలు ఉప ముఖ్యమంత్రిని చేసిన ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ఆలోచించి, బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు.
కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని కాపాడే సెక్యూలర్ పార్టీ అని ఆయన అన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే, 7 రేస్ కోర్స్ రోడ్ (ప్రధానమంత్రి నివాసం)లో కూర్చుని డ్యాన్స్ చేసుకోవాలని లేదా రాజకీయాలు మానేసి రెండు సినిమాలు తీసి మోడీని మెప్పించాలని ఎద్దేవ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి తమ, ప్రజల, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆయన హెచ్చరించారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేది కాంగ్రెస్ కాదని, ఆ పని తమ నాయకుడు మోడీ చేస్తున్నారని పరోక్షంగా విమర్శించారు.
నిజంగా నిలదీయాల్సింది తన నాయకుడినే అని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల నలుగురు వచ్చి కాల్చిపోతే పవన్ కళ్యాణ్ పిట్ట కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని విమర్శించారు. నలుగురు ముష్కరులు 28 మందిని చంపితే వారం రోజులుగా అరెస్టు ఎందుకు జరగలేదని, ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? లేక ఇంటెలిజెన్స్ వైఫల్యమా? అని ప్రశ్నించాల్సింది పవన్ కళ్యాణే అని ఆయన అన్నారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చానని చెప్పిన నరేంద్ర మోడీ ఈ విషయమై సమాధానం చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.