Begin typing your search above and press return to search.

బాహుబలి కరెన్సీ నోటు ఆ దేశం సొంతం.. ఏమా కథ?

ఈ దేశం ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కరెన్సీ నోటును ప్రింట్ చేసింది.. అది కూడా పరిమితంగా. దీంతో.. ఈ లిమిటెడ్ ఎడిషన్ కరెన్సీ నోటును సొంతం చేసుకోవటానికి కొందరు ఆసక్తి చూపటంతో ఈ దేశం ముచ్చట వార్తల్లోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   29 April 2025 9:01 PM IST
Burundi Largest Currency
X

సామాన్య ప్రజల నుంచి తరచూ ట్రావెల్ చేసే వారికి సైతం పరిచయం లేని దేశం బురుండి. తూర్పు ఆఫ్రికాలోని ఒదక పేద దేశం. ప్రకృతి ఆ దేశానికి వరం కాగా.. ఆ దేశంలోని రెండు జాతుల మధ్య విభేదాలు అక్కడి ప్రజలకు శాపంగా మార్చటమే కాదు.. ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మార్చింది. ఇంతకీ ఈ దేశం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడీ దేశం వార్తల్లోకి ఎందుకు వచ్చింది? అన్న సందేహం కలగొచ్చు. అక్కడికే వస్తున్నాం. ఈ దేశం ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కరెన్సీ నోటును ప్రింట్ చేసింది.. అది కూడా పరిమితంగా. దీంతో.. ఈ లిమిటెడ్ ఎడిషన్ కరెన్సీ నోటును సొంతం చేసుకోవటానికి కొందరు ఆసక్తి చూపటంతో ఈ దేశం ముచ్చట వార్తల్లోకి వచ్చింది.

ఇంతకూ ఈ దేశం ఎక్కడ ఉంటుందంటే.. భూమధ్య రేఖకు దక్షిణంగా తూర్పు మధ్య ఆఫ్రికాలో ఉంది. ఈ దేశానికి ఉత్తర సరిహద్దులో రువాండా.. తూర్పు.. దక్షిణ సరిహద్దులో టాంజానియా.. పశ్చిమ సరిహద్దులో కాంగో దేశాలు ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో మధ్యలో ఉండే ఈ దేశ జనాభా మన హైదరాబాద్ కంటే తక్కువగా ఉంటుందని చెప్పాలి. ప్రపంచంలో అత్యంత పెద్దదైన మంచినీటి సరస్సు ఈ దేశం సొంతం. ఈ దేశంలో దివా.. హుటు.. టుట్టీ ప్రజలు నివసిస్తుంటారు. ఈ దేశ చరిత్రలోకి వెళితే.. ప్రారంభంలో ఈ దేశాన్ని జర్మనీ సొంతం చేసుకోగా.. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఓటమితో ఈ దేశం బెల్జియం సొంతమైంది. అనంతరం ఒప్పందంలో భాగంగా.. జర్మనీ.. బెల్జియం దేశాలు కలిసి బురుండిని పాలించాయి.

1962లో ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ప్రారంభంలో రాచరికం చేతిలో అధికారం ఉండేది. 1966లో గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఈ దేశంలోని ప్రధాన జాతుల (హుటు - టుట్సీ జాతుల నడుమ విభేదాలు) మధ్య నడిచిన సంఘర్షణ ఈ దేశాన్ని అత్యంత పేద దేశంగా మార్చింది. దీనికి కారణం ఈ సంఘర్షణ సుదీర్ఘంగా సాగటమే. ఈ దేశ రాజకీయ రాజధానిగా గిటెగా ఉండగా.. దేశంలో అతి పెద్ద నగరంగా బుజుంబురాగా నిలుస్తుంది. సంప్రదాయంగా హుటులు రైతులుగా ఉంటే.. టుట్సీలు పశువుల కాపరులుగా వ్యవహరిస్తుంటారు. బురుండి అధికారిక భాష రుండి.

ఇంతకూ ఈ దేశం బాహుబలి కరెన్సీ నోటు ముచ్చటలోకి వస్తే.. 40 సెంటీమీటర్ల పొడవు. 29 సెంటీమీటర్ల వెడల్పుతో ప్రపంచంలోనే అత్యంత పెద్ద కరెన్సీ నోటను ఈ దేశం ముద్రించింది. దీని విలువ 10వేల ఫ్రాంకులుగా డిసైడ్ చేశారు. అయితే.. ఈ బాహుబలి కరెన్సీ నోట్లను కేవలం వెయ్యి మాత్రమే విడుదల చేశారు. ఈ చర్య ద్వారా వచ్చే ఆదాయాన్ని అక్కడి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు.. పర్యాటక ప్రాంతాలకు.. పార్కుల నిర్వహణకు వినియోగించేందుకు వీలుగా ఈ నోట్లను ప్రింట్ చేశారు.

ఈ భారీ నోటు మార్కెట్ లో 2 వేల యూరోల ధర పలుకుతోంది. ఇదిలా ఉండగా.. ఈ నోటును సొంతం చేసుకున్నారు విజయవాడకు చెందిన శ్రీధర్ అనే వ్యాపారవేత్త. ఇందుకోసం రూ.1.97 లక్షలు వెచ్చించారు. చివరగా ఒక్కమాట.. ఈ దేశంలో విచిత్రమైన నిబంధన ఉంది. అదేమంటే.. జాగింగ్ ఈ దేశంలో బ్యాన్. దేశ శాంతి భద్రతలు జాగింగ్ తో ముప్పు ఉంటుందన్న భావనతో ఆ దేశ పాలకులు బ్యాన్ విధించారు.