దయచేసి నా భర్తను వదిలేయండి.. కన్నీరు పెడుతున్న జవాన్ భార్య.. పాక్ స్పందిస్తుందా ?
ఈ నేపథ్యంలో తన భర్తకు సంబంధించిన సమాచారం కోసం బీఎస్ఎఫ్ జవాన్ భార్య సోమవారం కోల్‌కతా నుండి పంజాబ్‌కు చేరుకుంది.
By: Tupaki Desk | 29 April 2025 9:26 PM ISTపహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్‌లో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక జవాన్ పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్‌లోకి వెళ్లాడు. అతడిని పాకిస్తాన్ రేంజర్స్ అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాను పాకిస్తాన్ రేంజర్స్ సోమవారం కూడా రిలీజ్ చేయలేదు.
ఈ నేపథ్యంలో తన భర్తకు సంబంధించిన సమాచారం కోసం బీఎస్ఎఫ్ జవాన్ భార్య సోమవారం కోల్‌కతా నుండి పంజాబ్‌కు చేరుకుంది. ఆమె ప్రస్తుతం గర్భిణి. రజనీ తన ఎనిమిదేళ్ల కుమారుడు ఆరవ్, ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడితో కలిసి సోమవారం సాయంత్రం చండీగఢ్ విమానాశ్రయానికి చేరుకుంది. కోల్‌కతా నుండి బయలుదేరే ముందు వారి కుమారుడు మాట్లాడుతూ.. "పాకిస్తాన్ మా సర్వస్వం తీసుకెళ్లినా ఫర్వాలేదు, కానీ నా తండ్రిని మాత్రం వదిలేయండి" అని వేడుకున్నాడు.
బీఎస్ఎఫ్ జవాన్ భార్య మాట్లాడుతూ.. తన భర్తను ఆరు రోజులుగా పాకిస్తాన్ సైన్యం నిర్బంధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తాను పంజాబ్‌కు వెళ్లి సరిహద్దు భద్రతా దళ అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే ఢిల్లీ తలుపులు కూడా తడతానంటూ ఆమె చెప్పుకొచ్చింది. బీఎస్ఎఫ్ అధికారులు తన భర్త క్షేమంగా ఉన్నారని చెప్పారని, కానీ శత్రుదేశ సైన్యం అదుపులో ఉన్న తన భర్త గురించి తాను ఎలా ఆందోళన చెందకుండా ఉండగలనంటూ ఆమె ప్రశ్నించారు.
ఆమె మాట్లాడుతూ.. తన నుండి ఏదో దాస్తున్నారని తనకు అనుమానంగా ఉందని తెలిపింది. ఏప్రిల్ 23న పూర్ణం కుమార్ సా ఫిరోజ్‌పూర్‌లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పంట కోస్తున్న రైతుల భద్రత కోసం వెళ్ళాడు. అయితే పూర్ణం కుమార్ సా పొరపాటున సరిహద్దు దాటడంతో పాకిస్తాన్ రేంజర్స్ అతడిని పట్టకున్నారు.
ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ అధికారులు పాక్ రేంజర్స్‌తో రెండుసార్లు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించినప్పటికీ, వారు జవాన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా లేరు. తరువాత మరోసారి ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేసినప్పటికీ పాకిస్తాన్ నుండి ఏ అధికారి సమావేశానికి హాజరు కాలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరోసారి క్షీణించిన విషయం తెలిసిందే.