'ఓటు చోర్' రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ ఆసక్తికర పోస్టు
ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఓట్ చోర్, గద్దీ ఛోడ్" (ఓట్ల దొంగ, అధికారం వదిలిపెట్టు) అనే నినాదాలు చేస్తున్నారు.
By: Tupaki Desk | 13 Aug 2025 7:50 PM IST‘ఓట్ చోర్’ పేరుతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమంపై బీఆర్ఎస్ పార్టీ ఆసక్తికరంగా స్పందించింది. దేశవ్యాప్తంగా ‘ఓట్ చోర్’ అంటూ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారని గుర్తు చేస్తూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. రాహుల్ గాంధీ స్పందించాల్సిన సమయం వచ్చిందని అందులో వ్యాఖ్యానించింది.
ఎన్నికల నిర్వహణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. లోక్‌సభ సమావేశాలను అడ్డుకోవడంతోపాటు దాదాపు 300 మంది ఎంపీలతో ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం చేపట్టిన ఈసీ భారీగా ఓట్లు తొలగించి, అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. ఓట్లు తొలగించడం ద్వారా ఓటు దొంగతనానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఓట్ చోర్, గద్దీ ఛోడ్" (ఓట్ల దొంగ, అధికారం వదిలిపెట్టు) అనే నినాదాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ చేపట్టిన ఈ ఉద్యమానికి ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. ఓటర్ల జాబితాను సరిగ్గా తయారు చేయాలని, ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఆందోళనలలో "లోక్‌తంత్ర బచావో మషాల్ మార్చ్" (ప్రజాస్వామ్యాన్ని కాపాడండి మషాల్ మార్చ్) వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ నెల 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయితే బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ఓట్ చోర్ కార్యక్రమం ద్వారా ఆ పార్టీనే ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిందని చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అప్పట్లో టీడీపీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్ల కొనుగలుకు ప్రయత్నించారని నాటి వీడియోను జత చేసి వైరల్ చేస్తోంది.
దేశంలోనే అతిపెద్ద ఓటు దొంగ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ట్వీట్ చేసిన బీఆర్ఎస్, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ పోస్టు చేసింది.