Begin typing your search above and press return to search.

బాలయ్య హిందూపురం కాదా...ఎక్కడ పోటీ అంటే ?

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురానికి ఒక ముద్దు పేరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెట్టాయి.

By:  Satya P   |   13 Aug 2025 7:52 PM IST
బాలయ్య  హిందూపురం కాదా...ఎక్కడ పోటీ అంటే ?
X

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురానికి ఒక ముద్దు పేరు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెట్టాయి. ఆ విధంగా నందమూరిపురం అని అంటాయి. తెలుగుదేశం పార్టీ పుట్టాక జరిగిన ప్రతీ ఎన్నికలోనూ హిందూపురం అసెంబ్లీ సీటు ఆ పార్టీనే వరించింది. ఇక నందమూరి కుటుంబం నుంచే ఏడుసార్లు గెలుపొందారు. ఎన్టీఆర్ మూడు సార్లు నందమూరి హరిక్రిష్ణ ఒకసారి బాలక్రిష్ణ మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. బాలయ్య అయితే సినీ ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ వరసగా మూడు సార్లు గెలవడం ఒక గ్రేట్ సక్సెస్ గా చెబుతారు.

హిందూపురం ఈసారి వద్దా :

అయితే మూడు సార్లు తనను గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేను చేసిన హిందూపురం మీద బాలయ్యకు మోజు తగ్గిందా లేక ఆయన దృష్టిలో వేరే ఆలోచనలు ఉన్నాయా అన్న చర్చ ఒకటి బయల్దేరింది. బాలయ్య తాజాగా అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ అభిమానులతో మాట్లాడారు. వారంతా బాలయ్య బాబుక్ హిందూపురం అడ్డా అని నినాదాలు చేశారు. వాటి మీద స్పందించిన బాలయ్య ఒక్క హిందూపురం ఏమిటి ఏపీ తెలంగాణాలో ఎక్కడ నుంచి అయినా పోటీ చేసి తాను గెలుస్తాను అని కీలక వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య బదులుగా ఆమె :

ఇదిలా ఉంటే హిందూపురంలో బాలయ్య ఈసారి పోటీ చేయకపోవచ్చు అన్న దానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అన్న చర్చ సాగుతోంది. బాలయ్య హిందూపురంలో ఎక్కువగా ఆయన సతీమణి వసుంధర తిరుగుతున్నారు. ఈ మధ్యనే ఆమె సుపరిపాలనలో తొలి అడుగు అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక ప్రారంభోత్సవాలలో పాలు పంచుకున్నారు. బాలయ్య హిందూపురంలో ఆమె తరచూ పర్యటనలు చేయడం చూసిన వారు వచ్చే ఎన్నికల్లో ఆమె అభ్యర్ధిగా ఉంటారు అని అంటున్నారు

బాలయ్య ఎక్కడ అంటే :

బాలయ్య వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. ఈ మధ్యనే ఆయన ఢిల్లీకి వెళ్ళినపుడు తమ పార్టీకి చెందిన ఎంపీలతో మాట్లాడుతూ ఈసారి తాను కూడా పార్లమెంట్ కి వస్తాను అని మనసులో కోరికను బయటపెట్టారు అని అంటున్నారు. బాలయ్య మూడు సార్లు గెలిచినా ఏపీలో ఒక ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలన్నా కుటుంబ సామాజిక పరమైన సమీకరణలు సెట్ కావడం లేదు. దీంతో ఆయన రూటు మార్చారా లేక అధినాయకత్వం ఆయనకు అలా సలహాలు ఇచ్చిందా అన్న చర్చ సాగుతోంది.

కేంద్ర మంత్రి అవుతారా :

ఇక బాలయ్య కనుక ఎంపీగా పోటీ చేస్తే మరోమారు ఎన్డీయే ప్రభుత్వంలో ఏపీ నుంచి టీడీపీ కోటాలో కేంద్ర మంత్రి కావచ్చు అన్న చర్చ కూడా ఉంది. వచ్చే ఎన్నికల నాటికి బాలయ్య దాదాపుగా ఏడు పదుల వయసుకు చేరువ అవుతారు. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోయినా కామా అయినా పెట్టి మరీ అధికార బాధ్యతలు ఆయన నిర్వహించాలని చూస్తున్నారు అని అంటున్నారు. రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉన్నా జాతీయ స్థాయిలో అయితే కేంద్ర మంత్రి పదవికి అభ్యంతరం ఉండకపోవచ్చు అని అంటున్నారు. మొత్తానికి బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ఇపుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని చర్చకు పెంచుతున్నాయని అంటున్నారు.