జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. *కెప్టెన్* ఒక అడుగు ముందుకు!
తెలంగాణలో ఏడాదిన్నర కిందట ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో ఉప ఎన్నికను ఎదుర్కొంటోంది.
By: Tupaki Desk | 13 Aug 2025 7:55 PM ISTతెలంగాణలో ఏడాదిన్నర కిందట ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో ఉప ఎన్నికను ఎదుర్కొంటోంది. రెండూ హైదరాబాద్ లోని నియోజకవర్గాలే కావడం.. రెండూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నెగ్గినవే కావడం గమనార్హం. ఇక
మొదటి ఉప ఎన్నిక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య ప్రియ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో రాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ సీటును కైవసం చేసుకుంది. ఇక రెండు నెలల కిందట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో మరో ఉప ఎన్నిక వచ్చింది. బహుశా వచ్చే అక్టోబరు-నవంబరు మధ్యన ఈ ఉప ఎన్నిక జరగనుంది.
ఒకప్పటి కంచుకోటలో...
2009కి ముందు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడగా కాంగ్రెస్ గెలిచింది. 2014 నుంచి మాత్రం గోపీనాథ్ (తొలుత టీడీపీ తర్వాత బీఆర్ఎస్) హవా సాగింది. ఇప్పుడు ఆయన లేనందున మళ్లీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ముగ్గురు మంత్రులకు బాధ్యతలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను సీఎం రేవంత్ మంత్రులు వివేక్, పొన్నం, తుమ్మలకు అప్పగించారు. అభ్యర్థి విషయంలో రేవంత్ ఆలోచనలు వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు. బహుశా యువ నాయకుడి వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతలోనే గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ ఓ అడుగు ముందుకేశారు.
ఢిల్లీలో మాజీ కెప్టెన్
అజహర్ తాజాగా ఢిల్లీలో కనిపించారు. కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్ తో భేటీ అయ్యారు. ఇటీవల అజహర్ జూబ్లీహిల్స్ లో పోటీపై పట్టుదలగా ఉన్నారు. నియోజకవర్గంలోని నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో సోనియా, రాహుల్ ను కలిసి జూబ్లీహిల్స్ టికెట్ గురించి అడిగి ఉంటారని భావిస్తున్నారు. రాష్ట్ర పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సైతం ఈ సమయంలో అక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సానుకూల స్పందన వచ్చిందని చెబుతున్నారు.
మరి రేవంత్ ఏమంటారో...?
ఓటు కొడంగల్ లో ఉన్నా జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ నివసించే ప్రాంతం. మరి ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో తన మాట చెల్లుతుందా? ఆయన కూడా అజహర్ వైపే ఉన్నారా? అన్నది త్వరలో తేలనుంది. ఉప ఎన్నికకు ఇంకా మూడు నెలలు ఉన్నందున ఇప్పుడే ఏమీ చెప్పలేం.