Begin typing your search above and press return to search.

దాయాదీ దేశంతో చెస్...ఇండియన్ ఆర్మీ చీఫ్ కామెంట్స్ వైరల్!

ఆపరేషన్ సిందూర్ ముగిసింది.. ముగిసి చాలా రోజులైంది.. ఆ దెబ్బకు పాక్ ఇంకా కోలుకోలేని పరిస్థితి..

By:  Raja Ch   |   10 Aug 2025 10:55 PM IST
దాయాదీ దేశంతో చెస్...ఇండియన్ ఆర్మీ చీఫ్ కామెంట్స్ వైరల్!
X

ఆపరేషన్ సిందూర్ ముగిసింది.. ముగిసి చాలా రోజులైంది.. ఆ దెబ్బకు పాక్ ఇంకా కోలుకోలేని పరిస్థితి.. మరోవైపు ఆ ఆపరేషన్ పై భారత్ లో సర్కార్ పై పొలిటికల్ కామెంట్స్ పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో వరుసగా త్రివిథాధినేతలు ఒకరి తర్వాత ఒకరన్నట్లుగా చేస్తోన్న కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

అవును... పహల్గాం దాడికి ప్రతీకారంగా అటు ఉగ్రవాదులకు, ఇటు పాక్ కు ఉమ్మడిగా ఇచ్చిన స్ట్రోక్ 'ఆపరేషన్‌ సిందూర్‌' లో భారత్ సాధించిన విజయం గురించి ఇప్పటికే పలు వివరణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పాక్ కు చెందిన 5 యుద్ధ విమానాలను, మరో పెద్ద విమానాన్ని భారత్ నేలకూల్చిందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ శనివారం ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌ పై ఇటీవల ఐఐటీ మద్రాస్‌ లో ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది మాట్లాడిన వీడియో వైరల్‌ గా మారింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో మన సైన్యం దాయాది దేశంతో చెస్‌ ఆడిందని ఆయన అన్నారు. శత్రువు తదుపరి కదలికలు ఏమిటో కూడా ఆ సమయంలో తమకు తెలియదని.. ఈ పరిస్థితిని "గ్రేజోన్" అంటారని అన్నారు.

అయినప్పటికీ సమయానుకూలంగా స్పందిస్తూ.. ఆ దేశానికి చెక్‌ పెట్టామని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో... ఈ ఆపరేషన్‌ ను ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని ద్వివేది తెలిపారు. ప్రధానంగా... మన పౌరులను బలి తీసుకున్న ఉగ్రవాదులను అంతం చేయాలని త్రివిధ దళాలు కోరినప్పుడు.. ప్రధాని మోడీ, రక్షణ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తమకు స్వేచ్ఛ ఇచ్చారని వెల్లడించారు.

ఏది ఏమైనా... మూడు నెలల క్రితం జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌ లో పాక్‌ విమానాలను కూల్చిన విషయాన్ని శనివారం నాడు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ మొదటిసారి బహిర్గతం చేయడం.. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు వైరల్ కావడంతో అటు ప్రజలకు, ఇటు ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఒకేసారి మరింత స్పష్టత ఇచ్చినట్లయ్యిందనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తుండటం గమనార్హం.