జగన్ మానస పుత్రిక....విజన్ యూనిట్స్ గానే !
ఏపీలో కీలక మార్పు దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలు వేలల్లో ఉన్నాయి.
By: Garuda Media | 6 Nov 2025 8:05 PM ISTఏపీలో కీలక మార్పు దిశగా టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలు వేలల్లో ఉన్నాయి. వీటిలో లక్షా పాతిక వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీటి పేరుని మార్చాలని ఈ మధ్య కాలంలోనే కూటమి ప్రభుత్వం అనుకుంటూ ఉంది. ఇపుడు సమయం వచ్చింది. దాంతో పేరు మార్పు మీద నిర్ణయం తీసుకుంది. ఇక మీదట వీటిని సచివాలయాలుగా పిలవరు. వాటికి కొత్త పేరు గా విజన్ యూనిట్స్ గా కూటమి ప్రభుత్వం పెట్టింది.
బాబు కీలక ప్రకటన :
మంత్రులు అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను విజన్ యూనిట్స్ గా పిలవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ఈ సచివాలయాలకు ప్రజలకు మరింత సమర్ధంగా ఇంకా చేరువగా సేవలు చేయడానికి అవసరం అయిన విధి విధానాలు రూపొందించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ విధంగా వాటిని డిజైన్ చేస్తామని చెప్పారు. అందుకే వాటికి విజన్ యూనిట్స్ గా పేరు పెట్టినట్లుగా చెప్పారు. రానున్న కాలంలో ఇవి ప్రజల సేవలకు కీలకంగా కేంద్ర బిందువుగా నిలుస్తాయని ఆయన చెప్పారు.
న్యూ టెక్నాలజీతో :
గ్రామ వార్డు సచివాలయాలలో నూతన సాంకేతిక విధానాన్ని ప్రవేశపెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా సమర్ధంగా సక్రమంగా మరింతగా అందుబాటులోకి వస్తాయని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలకు అవసరమైన సంక్షేమ పధకాలు, అలాగే రికార్డులు సర్టిఫికెట్లు, ప్రభుత్వం చేసే సహాయం అన్నీ కూడా ఒకే వేదిక మీదకు తెస్తామని చెబుతున్నారు.
భవిష్యత్తు పాలనంతా :
రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ విధానాలు కానీ అమలు చేసే ఒక గ్రౌండ్ లెవెల్ వ్యవస్థగా విజన్ యూనిట్స్ ని తీర్చిదిద్దుతారని అంటున్నారు. ఇక రానున్న రోజులలో పాలన అంతా ఇక్కడ నుంచే జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామ స్థాయిలో పాలన అంతా ఆధునిక సాంకేతిక ముడి పెడుతూ వేగంగా అందేలా చర్యలు తీసుకుంటారు అని అంటున్నారు.
వైసీపీ గురుతులు :
గ్రామ వార్డు సచివాలయాలు అంటే వైసీపీ గురుతులుగా ఉన్నాయి. వాటిని చూసినపుడు వైసీపీ గుర్తుకు వస్తుంది. వీటిని జగన్ మానస పుత్రికలు అని చెబుతారు. అయితే వీటి పేరు మార్పుతో పాటు సమూలమైన ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దాంతో ఇది చంద్రబాబు విజన్ తో కొత్త రూపుని సంతరించుకోనున్నాయి. వాటి మీద బాబు మార్క్ కనిపించేలా సకల చర్యలు తీసుకోబోతున్నారు. దాంతో వైసీపీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. అయితే పాలన ప్రజల వద్దకు చేరువ చేసేందుకు వైసీపీ ఆనాడు నిర్ణయం తీసుకుందని అంటున్నారు. దానిని మరింతగా ముందుకు తీసుకుని వెళ్ళే క్రమంలో భారీ సంస్కరణల దిశగా కూటమి సర్కార్ ఈ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. టెక్నాలజీని అనుసంధానం చేస్తూ వీటికి మరింత జవసత్వాలు అందిస్తే కనుక గ్రామ స్థాయిలో ప్రజలకు పాలన ఇంకా చేరువ అవుతుంది. ఆ విధంగా ఏపీ ఆదర్శ మవుతుంది. దాంతో రాజకీయంగా కంటే సంస్కరణ రూపంలోనే ఈ నిర్ణయాన్ని చూడాలన్న మాట కూడా ఉంది.
