బిగ్ నంబర్ టార్గెట్ గా బాబు జగన్ పవన్ వ్యూహాలు !
వైసీపీ తీరు చూస్తే కేవలం 11 సీట్లు మాత్రమే తమకు వచ్చాయని నిరాశపడడంలేదు. 40 శాతం ఓటు షేర్ తమకు ఉందని తమ వాటా ఘనమే అంటోంది.
By: Satya P | 11 Aug 2025 9:28 AM ISTఏపీలో రాజకీయం 2025లో ఉన్నా ఆలోచనలు వ్యూహాలు 2029 మీదకు వెళ్ళిపోతున్నాయి. ఆ ఎన్నికల కోసమే అంతా ప్రిపేర్ అవుతున్నారు. చూస్తే గట్టిగా నాలుగేళ్ళ దాకా ఎన్నికలకు వ్యవధి ఉంది. కూటమి చేతిలో అధికారం నిండుగా ఉంది. ప్రజలు ఇచ్చిన 94 పెర్సెంట్ స్ట్రైక్ రేటు నిండుగా ఉంది. లక్ష్యాలు చాలానే ఉన్నాయి. అయినా సరే అంతా 2029 అంటున్నారు. వైసీపీ తీరు చూస్తే కేవలం 11 సీట్లు మాత్రమే తమకు వచ్చాయని నిరాశపడడంలేదు. 40 శాతం ఓటు షేర్ తమకు ఉందని తమ వాటా ఘనమే అంటోంది.
అన్నీ లెక్కలూ అక్కడే :
ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే ఏపీ విభజన చట్టం మేరకు ఈ సీట్ల సంఖ్య మరో 50 దాకా పెరుగుతాయని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. 2027లో దేశవ్యాప్తంగా జనాభా గణన కుల గణన కూడా సమాంతరంగా పూర్తి అవుతాయి. ఆ మీదట 2029 ఎన్నికలకు రెండేళ్ళకు పైగా సమయం ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉంది కాబట్టి టీడీపీ జనసేన పట్టుబట్టి మరీ సీట్ల పెంపుని చేయించుకుంటాయని అంటున్నారు. దాంతో పక్కాగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయన్న అంచనాలు అయితే బలంగానే ఉన్నాయి.
టీడీపీ వ్యూహాలు అందుకే :
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కిక్కిరిసి ఉంది. అయినా సరే వైసీపీ నుంచి నేతలకు ఆహ్వానం పలుకుతోంది. బలమైన నేతలు నియోజకవర్గాలలో ప్రభావం చూపించే వారు ఉంటే కనుక కచ్చితంగా వారిని చేర్చుకోవడానికే చూస్తోంది. అంతే కాదు టీడీపీలో గత ఎన్నికల్లో సీట్లు దక్కక త్యాగం చేసిన వారికి ప్రయారిటీ ఇవ్వాలని చూస్తోంది. ఇక పార్టీలో ఎమ్మెల్యేలుగా నెగ్గి వచ్చిన వారి పనితీరు ఎప్పటికపుడు మధింపు చేయడం వెనక కూడా సరిగ్గా మార్కులు దక్కని వారిని పక్కకు పెట్టడం అన్న ఆలోచన ఉంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మిత్రులకు ఎన్ని సీట్లు ఇవ్వాలి తమ పార్టీకి ఎన్ని ఉంచుకోవాలి ఎక్కడెక్కడ సీట్లు పెరుగుతాయి ఏమిటి అన్నది పూర్తిగా అవగాహనతో పార్టు రాజకీయ ప్రణాళికలతో టీడీపీ స్పష్టంగా ఉంది అని అంటున్నారు.
జనసేన ప్లాన్స్ వెనక :
మరో వైపు చూస్తే జనసేన ప్లాన్స్ కూడా అలాగే ఉంటున్నాయి. ఈసారి 21 మాత్రమే. వచ్చేసారి అంతకు మరింత అన్న లెక్కలతో జనసేన ఉంది. ఆ పార్టీ కూడా ఎక్కువగా సీట్లు తెచ్చుకోవాలని అలా పొత్తులలో సాధించిన సీట్లన్నీ 2024 ఎన్నికల్లో మాదిరిగా గెలిచి తీరాలని ఆలోచనలు చేస్తోంది. ఇక తమకు బలం తక్కువగా ఉన్న చోట రాయలసీమ లాంటి జిల్లాలలో వైసీపీ నుంచి కూడా నేతలను తీసుకోవాలని చూస్తోంది. ఆ విధంగా అందరికీ భరోసా ఇస్తూ వచ్చే ఎన్నికల్లో తమ స్థాన బలం అంగబలం చూపించి పొత్తులో ఎక్కువ వాటా సాధించాలని చూస్తోంది. జనసేన సైతం 225 సీట్లు అన్న వ్యూహంతోనే సాగుతోంది అని అంటున్నారు.
జగన్ లెక్క పక్కా యేనా :
ఏపీలో ఎలా చూసుకున్నా ఉన్నవి మూడు ప్రధాన పార్టీలే అన్నది వైసీపీ ఆలోచన. టీడీపీ జనసేనలలో ఇప్పటికే నేతలు చాలా మంది ఉన్నారని వచ్చే ఎన్నికల్లో 225 సీట్లు చేసినా కూటమిలోని మూడు పార్టీలకు పంచుకోవడానికి చాలవని వైసీపీ లెక్క వేస్తోంది. దాంతో మరో యాభై సీట్లు అదనంగా వచ్చినా సీటు దక్కని వారు పెద్ద ఎత్తున ఉంటారని వీరందరికీ సరైన రాజకీయ వేదికగా వైసీపీయే ఉంటుందని భావిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పెద్దగా పెర్ఫార్మ్ చేయదని దాంతో ఆ పార్టీలోకి వెళ్లేది ఉండదని తలపోస్తోంది అలా ఎక్కువ సీట్లు ఎంతగా పెరిగితే అంతగా వైసీపీకే లాభమని కూడా భావిస్తోంది. తమ పార్టీలో సమర్ధులకు టికెట్లు ఇస్తూనే బలమైన నేతలు ఇతర పార్టీలలో ఉంటే సామాజిక రాజకీయ ప్రాంతాల సమీకరణలలో భాగంగా తీసుకోవాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే 225 నంబర్ ని ముందు పెట్టుకునే వైసీపీ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది అని అంటున్నారు.