రాహుల్ విషయం తేల్చేసిన జగన్ ?
జగన్ 2011లో కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చారు. అయితే అప్పటి రాజకీయాలు వేరు 2025 నాటి రాజకీయ పరిస్థితులు వేరు అని అంతా గుర్తు చేస్తున్నారు.
By: Tupaki Desk | 13 Aug 2025 8:00 PM ISTరాజకీయాలు అంటే నిరంతరం మారుతాయి. ఎన్నో వ్యూహాలు ఉంటాయి. ఇక్కడ శాశ్వత మిత్రులు శత్రువులు అన్న వారు ఎవరూ ఉండరు. వారు వీరు అవుతారు. ఒకనాటి బద్ధ శత్రువులు పక్కనే కూర్చుని ముచ్చటించుకుంటారు. అలాగే ఒకే కంచం ఒకే మంచం అనుకున్న వారు ఆగర్భ శత్రువులు అవుతారు. ఇదంతా రాజకీయం చేసే తమాషాగానే చూడాల్సి ఉంటుంది. అయితే రాజకీయాల్లో ఇవన్నీ కూడా వ్యూహాలుగానే చెబుతారు. ఎక్కడో ఏదో స్టేజిలో ఒకరి అవసరం మరొకరికి ఉంటుంది. అయితే సూటిగా రాజకీయం చేయడం అన్నది సాధ్యపడుతుందా అంటే చాలా తక్కువ అని చెప్పాలి. ఇంకా చెప్పాలి అంటే అరుదు అని చెప్పాలి.
కామ్రేడ్స్ కమలం అలా :
ఇక దేశ రాజకీయాల్లో కుడి ఎడమల భావజాలం కలిగి ఉన్నారు అన్నది బీజేపీ వామపక్షాల విషయంలో అంతా చెబుతారు. అయితే ఈ పార్టీలు కూడా కొన్ని కీలక సందర్భాలలో భుజం భుజం కలిపాయని రాజకీయ చరిత్ర నిరూపిస్తోంది. 1977లో జనతా ప్రభుత్వంలో అలాగే 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఒకరి పక్కన ఒకరు కూర్చోకున్నా కలసి పనిచేశారు. ఎందుకు అంటే ఆనాటి పరిస్థితుల కారణంగా అని చెప్పాల్సి ఉంది. అలాగే కాంగ్రెస్ తో రాష్ట్రాలలఒ విభేదించి జాతీయ స్థాయిలో కలవడం కూడా కామ్రేడ్స్ వ్యూహాల పదునేంటో చెబుతుంది.
తెలుగు నాట అనూహ్యమైన పొత్తు :
ఇక తెలుగు నాట చూస్తే కలలో సైతం ఎవరూ అనుకోని విధంగా తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు 2018 తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో కుదిరింది. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ స్థాపించారో అదే కాంగ్రెస్ తో కలసి టీడీపీ ఆనాటి రాజకీయాలు పరిస్థితులను బట్టి తన వ్యూహాలను మార్చుకుని అడుగులు వేసింది. వాటి ఫలితాల సంగతి పక్కన పెడితే 2024లో బీజేపీ తిరిగి టీడీపీకి చేరదీయడానికి ఈ పొత్తు చాలా దోహదపడింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. బాబును తాము కాదంటే కాంగ్రెస్ వైపు వెళ్తారు అన్న భయం కమలం పెద్దలకు నాడూ నేడూ ఉంది. అదే అసలైన రాజకీయ వ్యూహం.
జగన్ ఆ గట్టునేనా :
ఇక వైసీపీ అధినేత జగన్ తీరు చూస్తే ఆయన ఆ గట్టునే ఉండిపోతున్నారు అని అంటున్నారు. జగన్ 2011లో కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చారు. అయితే అప్పటి రాజకీయాలు వేరు 2025 నాటి రాజకీయ పరిస్థితులు వేరు అని అంతా గుర్తు చేస్తున్నారు. ఇపుడు జాతీయ స్థాయిలో కూటముల రాజకీయం సాగుతోంది. రాష్ట్రాల ఎన్నికల మీద జాతీయ ప్రభావం బలంగా పడుతోంది. ఏపీలో టీడీపీ గెలుపు వెనక మోడీ ఇమేజ్ కేంద్రంలో బలమైన ప్రభుత్వం అండ అన్నవి 2024లో ప్రభావితం చేశాయన్నది కూడా ఒక విశ్లేషణ. మరి అలా చూస్తే ఒంటరి పోరు చేయడం ద్వారానే ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తామన్న వైసీపీ అధినాయకత్వం ధీమా వెనక అతి ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
నాడు ఢిల్లీలో ధర్నా వేళ :
ఇక చూస్తే 2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయాక ఏపీలో అక్రమ కేసులు అంటూ జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ఢిల్లీలో భారీ ధర్నాను నిర్వహించింది. ఆ ధర్నాకు ఎన్డీయే ఎంపీలు ఎవరూ హాజరు కాలేదు. కానీ ఇండియా కూటమి ఎంపీలు వచ్చి మద్దతు ఇచ్చారు. దాంతో వైసీపీ ఇండియా కూటమి వైపు ఉందని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. కానీ కట్ చేస్తే రాహుల్ గాంధీ మీద గతంలోనూ జగన్ కొన్ని విమర్శలు చేశారు. ఇక తాజాగా చూస్తే ఆయనను చంద్రబాబుని కలిపేశారు.
చాన్స్ తీసుకున్న వారికే :
అయితే రాజకీయాల్లో చాన్స్ ఎవరు తీసుకుంటే వారికే అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటారు నిజం చెప్పాలీ అంటే 2024 ఎన్నికలలో పొత్తుకు బీజేపీ సైతం వైసీపీని మొదట కోరిందని గాసిప్స్ అయితే ఉన్నాయి. కానీ వైసీపీ నో చెప్పిదని కూడా పుకార్లు షికారు చేశాయి. ఆ చాన్స్ అలా టీడీపీ తీసుకుంది. అయితే 2029 వేళ జాతీయ రాజకీయాలు ప్రజల మూడ్ బట్టి వైసీపీ చాన్స్ తీసుకోకపోతే టీడీపీ తీసుకుంటుందన్న ప్రచారం ఉంది. అందులో తప్పు కూడా లేదని రాజకీయ మేధావులు చెబుతారు.
ఎందుకంటే ఇది ఫక్తు రాజకీయం. ఇలాగే చేయాలి అంటే కష్టం. కాబట్టి వైసీపీ తన ముందు ఉన్న ఆప్షన్లు చూసుకుంటూ వ్యూహ రచన చేయాలన్నది అయితే రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది. కానీ జగన్ తాజా ప్రెస్ మీట్ లో రాహుల్ గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన తేల్చేసినట్లుగానే ఉంది అని అంటున్నారు. సో ముందు ముందు ఏమి జరుగుతుంది అన్నది ఆలోచించాలి మరి.