ప్రజల్లోనే లేరు.. అయినా ఎమ్మెల్యేకు జేజేలా ...!
ఆయన సీనియర్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కూడా. దీనిని ఎవరూ కాదనరు. పైగా.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీల ప్రభంజనాన్ని కూడా తట్టుకుని గెలిచారు.
By: Tupaki Desk | 24 Jun 2025 5:00 PM ISTఆయన సీనియర్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి కూడా. దీనిని ఎవరూ కాదనరు. పైగా.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీల ప్రభంజనాన్ని కూడా తట్టుకుని గెలిచారు. దీనికి కూడా ఎవరూ కాదనలేని పరిస్థితి. అయితే.. గత ఏడాది కాలంలో ఆయన ప్రజల మధ్య ఉన్నారా? అంటే.. లేరు అనే సమాధానమే వినిపిస్తుంది. పైగా.. అనేక కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. దీంతో ఆయా కేసుల నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో ప్రజలను పట్టించుకోవడమే లేదు. అయినా.. ఆయనకు ప్రజల మద్దతు ఉందని.. తమ ఎమ్మెల్యే బాగా పనిచేస్తున్నారని ఓ సర్వే రిపోర్టు చెప్పుకొచ్చింది. మరి దీనిని ఎలా నమ్మాలి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇంతకీ ఆ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు నుంచి గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ఒక్కసారి కూడా.. ఆయన ప్రజల మధ్యకు రాలేదు. వారి సమస్యలు వినలేదు. ఎందుకంటే.. ఆయనే సమస్యల్లో కూరుకుపోయారు.
మదనపల్లె ఫైళ్ల దగ్ధం నుంచి భూముల కుంభకోణాల వరకు కూడా పెద్దిరెడ్డిపై నే కాకుండా.. ఆయన సతీమణిపైనా కేసులు నమోదయ్యాయి. ఇలాంటి సమయంలో ఆయన అసలు బయటకు రావడం లేదు. కానీ.. తాజా సర్వేలో ఆయన గ్రీన్ జోన్‌లో ఉన్నారని.. ప్రజలు ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పుకొని రావడం గమనార్హం. అయితే.. ఈ సర్వేపై టీడీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మధ్య లేని నాయకుడికి ప్రజలు సానుకూలత ఎలా చూపిస్తారన్న ప్రశ్న.
ఇక, అంతో ఇంతో ప్రజల్లో ఉంటున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డిని సర్వే సంస్థలు.. రెడ్ రోజ్‌లో ఉంచాయి. దీనిపైనా అనేక సందేహాలు ఉన్నాయి. ఆమె ప్రజల సమస్యలు వినేందుకు ప్రతి సోమవారం నియోజకవర్గంలో దర్బార్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. సమస్యలను ప్రస్తావిస్తున్నారు. పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా.. ఆమె రెడ్ జోన్‌లో ఉన్నారన్నది సర్వేలు చెబుతున్న మాట. దీంతో సర్వే సంస్థలు చెప్పిన రిజల్ట్‌పై సందేహాలు నెలకొన్నాయి. మరి ఏ ప్రాతిపదికన సర్వేలు చేశారో.. వారికే తెలియాలి.