టాప్ టూ బాటం : ఏపీ ముఖచిత్రం మారుతుందా ?
ఉమ్మడి ఏపీ నుంచి 2014లో నవ్యాంధ్రా ఆవిర్భవించింది. 13 ఉమ్మడి జిల్లాలతో ఏర్పాటు అయింది.
By: Satya P | 14 Aug 2025 4:00 AM ISTఉమ్మడి ఏపీ నుంచి 2014లో నవ్యాంధ్రా ఆవిర్భవించింది. 13 ఉమ్మడి జిల్లాలతో ఏర్పాటు అయింది. అయితే ఆ తరువాత భౌగోళిక స్వరూప స్వభావాలలో పెద్దగా మార్పు అయితే రాలేదు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం 2019లో ఉన్న 13 ఉమ్మడి జిల్లాలను కాస్తా 26గా మార్చారు. ఆ విధంగా కొత్త ఏపీగా చాలా వరకూ అవతరించింది. అయితే ఇపుడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం టాప్ టూ బాటం మార్చేందుకు ప్రయత్నం అయితే జరుగుతోంది.
అన్నింటా భారీ మార్పులే :
జిల్లాలు మండలాలు, గ్రామాల వరకూ భౌగోళిక స్వరూప స్వభావాలలో మార్పులు తీసుకుని రావడానికి అతి పెద్ద కసరత్తు సాగుతోంది. ఈ టోటల్ ప్రక్రియను ఏడుగురు మంత్రులతో ప్రభుత్వం నియమించిన ఉప సంఘానికి అప్పగించారు. ఈ ఉప సంఘం ఉమ్మడి పదమూడు జిల్లాలలో ఈ నెల 29, 30 తేదీలలో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తుంది. అలాగే సలహా సూచనలు కూడా తీసుకుంటుంది. ఇక దానిని బట్టి ఉప సంఘం ఒక పూర్తి నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందచేస్తుంది.
కొత్త ఏడాదిలో కొత్తగా :
దాంతో కొత్త ఏడాది అంటే 2026 జనవరి నాటికి ఈ మొత్తం మార్పులు ఆచరణలోకి వస్తాయని అంటున్నారు. అయితే కొత్త జిల్లాలు అంటే ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలలో సమూలమైన మార్పులు ఉండొచ్చు. ఈ జిల్లాలలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను మార్చవచ్చు. అలాగే పేర్లలో కూడా మార్పులు ఉంటాయి. జిల్లా కేంద్రాలు మారుతాయి. ఇక మండలాల విషయానికి వస్తే వాటి విషయంలో మార్పులు ఉంటాయని అంటున్నారు. అలాగే పేర్లలో మార్పులు కోరితే స్వీకరించి అందరి సూచనలకు అనుగుణంగా చేస్తారు. గ్రామాలు పంచాయతీలలో ఇదే తీరున జనాభిప్రాయానికి విలువ ఇస్తారు.
కూటమి ఫైనల్ టచ్ :
ఇప్పటిదాకా వైసీపీ ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాల ప్లేస్ లో భారీ మార్పులే ఉంటాయని అంటున్నారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల పేర్లు, సరిహద్దుల మార్పులపై సెప్టెంబర్ 15వ తేదీ నాటికి తుది నివేదిక ఇవ్వాలని మంత్రుల ఉప సంఘం భావిస్తోంది. వీటికి సంబంధించి ఇక ప్రజల నుండి మంత్రుల బృందం వినతులు స్వీకరించనుంది. ఈ లోపు కూడా ప్రజలు తమ వినతులను ఆయా జిల్లా కలెక్టర్లకు పంపవచ్చనని సూచిస్తున్నారు. అయితే సెప్టెంబర్ రెండో తేదీ వరకు మాత్రమే ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి వినతులు స్వీకరిస్తారు.
మొత్తంగానే భారీ ప్రక్రియ :
అయితే ఈ విధంగా ఎందుకు భారీ కసరత్తు చేయాల్సి వస్తోంది అంటే గత వైసీపీ ప్రభుత్వం గందరగోళంగా చేసిన జిల్లాల పునర్వీభజనను సరిచేసేందుకే మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెబుతున్నారు. డిసెంబర్ 31లోపు జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు ప్రక్రియ ముగిస్తామని వెల్లడించారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా మార్పులు కోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ గ్రామాలు, మండలాలు, డివిజన్లు, జిల్లాలకు సంబంధించిన మార్పులపైన కూడా మంత్రుల బృందం పని చేస్తుందని తెలిపారు. అయితే నియోజక వర్గాల జోలికి మాత్రం వెళ్లబోమని మంత్రి చెబుతున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని కూడా తాము పరిశీలిస్తామని ఆయన చెప్పడంతో ఆ దిశగా ఆశలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా పరిపాలనా సౌలభ్యమే గీటురాయిగా చేసుకుని చేసే పారదర్శకమైన ప్రక్రియ అని అంటున్నారు.
దీనిని బట్టి చూస్తే కొత్త ఏడాది వచ్చేసరికి ఏపీలో భౌగోళికపరంగా చాలా మార్పులు వస్తాయని అంటున్నారు. ఇపుడు ఉన్న జిల్లాలు కొన్ని మారవచ్చ్చు, అలాగే కొత్త జిల్లాలు రావచ్చు, కొత్త పేర్లు కూడా ఏపీ ప్రజలు చూడవచ్చు. మొత్తం మీద 1953లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత సమూలమైన మార్పులు అయితే ఏపీ చూడలేదు. ఇపుడు చూడబోతోంది అని అంటున్నారు.